కరోనా దెబ్బకు కాలానుగుణంగా నడిచే(సీజనల్) వ్యాపారాలు కుప్పకూలాయి. వేసవిలో జోరుగా సాగే చెరకు రసం, శీతల పానీయాలు, ఐస్‌క్రీం సంబంధిత వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి - జూన్ మధ్య నగరంతోపాటు ప్రధాన రహదారుల వెంట చెరకు రసం విక్రయాలు జోరుగా సాగుతాయి. రాష్ట్రంతో పాటు ఏపీ నుంచి చెరకు తెప్పించుకుని రసం విక్రయిస్తూ వేసవిలో రెండుచేతులా సంపాదించే వారికి ఈ ఏడాది నిరాశే మిగిలింది.
చెరకును దిగుమతి చేసుకుని రోజువారీగా విక్రయించే అడ్డాలు సైతం నగరంలో వందలాదిగా ఉండగా వాటిని నిర్వహించే వ్యాపారులూ నష్టపోయారు. వేసవి కోసం ముందుగా రైతులకు ఒక్కో వ్యాపారి రూ.లక్షల్లో అడ్వాన్సులు చెల్లించిన పరిస్థితి ఉంది. ఫలూదా, షర్బత్, లస్సీ తదితరాల తయారీ, విక్రయాలు బంద్ అయ్యాయి. వీటిపై వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఐస్‌ను తయారు చేసే చిన్నతరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి.