ప్రజలను ఆకర్షించటమే కాకుండా చైతన్య పరిచేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ యాదవ్. ప్రత్యేకతను బట్టి వివిధ ఆకారాల్లో కార్లు తయారు చేసి తన కారు షెడ్డునే మ్యూజియంగా మార్చేశాడు. తన సృజనాత్మకతతో సందర్శకులను ఆకర్షిస్తూ... సుదా కార్స్ మ్యూజియానికి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు. బ్యాట్ కార్, ఫూట్‌బాల్ కార్, కంప్యూటర్ కార్, సిగరెట్ కార్, హెల్మెట్ కార్, షూ కార్, టీ కప్ కార్, లేడీ షూ కార్, కండోమ్ కార్, లేడీ పర్స్ కార్, కెమెరా కార్, స్నూకర్ కార్ వంటి వింత వింత కార్లు తయారు చేస్తూ... చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆకర్షిస్తూ వారికి చైతన్యం కల్పిస్తుంటాడు. 2005 జులై 1న ప్రపంచంలో కెల్లా పెద్ద సైకిల్ తయారు చేసినందుకు గిన్నిస్ వరల్డ్‌లో కూడా చోటు దక్కించుకుంది ఈ సుధా కార్స్ మ్యూజియం.
వరల్డ్స్ న్యారో హౌస్...
కొవిడ్‌పై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు కరోనా కారు కూడా తయారు చేసి ప్రదర్శించారు. తాజాగా... ఈ మ్యూజియంలో క్రిస్మస్ ట్రీ కారును ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఈ సుధాకార్స్... ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇల్లు తయారు చేసి అందరి చేత వావ్ అని పించుకుంటోంది. కేవలం మూడు అడుగుల వెడల్పు పదిహేను అడుగుల పొడవు 21 అడుగుల ఎత్తుతో ఈ ఇల్లును రూపొందించారు. ఈ ఇంటింని తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందని సుధా కార్స్ ఫౌండర్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ న్యారో హౌస్‌లో... ఒక ఇంటిలో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.