వీలైతే ఫేస్బుక్, లేదంటే యూట్యూబ్, బోర్ కొడితే ఇన్స్టాగ్రాం.. అదీ కాదంటే స్నాప్‌చాట్... ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ వర్చువల్ లైఫ్‌లో బిజీ బిజీగా గడిపేవాళ్లు చాలామందే. ఈ సరదా వ్యాపకంతోనే అవకాశాల్ని, ఆదాయాన్నీ సృష్టించుకుంటున్నారు కొందరు. సోషల్ మీడియాతో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టేటస్‌నూ పెంచుకుంటున్నారు. అభిమానుల మనసూ కొల్లగొడుతున్నారు. ఈవెంట్స్, బ్రాండింగ్, ప్రమోషన్ అంశాలని షేర్ చేస్తూ అక్షరాలకు, చిత్రాలకు లక్షలు సంపాదిస్తున్నారు. ప్రతిభ మన సొంతమైతే అవకాశాలు ఎదురొస్తాయి అనడానికి ఈ యువతరంగాలే ఉదాహరణ. డిజిటల్ మార్కెట్ వీరిని ఇన్ఫ్లూయెన్సర్లుగా పిలుస్తోంది. పెద్ద పెద్ద బ్రాండ్ల కంపెనీలు వీరితో ప్రకటనల వీడియోలు చేయించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మార్కెట్ వేల కోట్లలో ఉందంటున్నాయి అధ్యయనాలు.
దక్షిణాదిలో టాప్
- ఫాలోవర్లు: 11 లక్షలు
టిక్‌టాక్‌లోకి రాక ముందు భాను సాధారణ కాలేజీ అమ్మాయే. ఇప్పుడేమో ఎక్కడికెళ్లినా జనం చుట్టూ మూగేంత సెలెబ్రెటీ. ఈ మిలీనియల్ డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికపైకి వచ్చిన రెండేళ్లకే లక్షలమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తనకు లక్షల రూపాయల ఆదాయాన్నీ తెచ్చి పెడుతోంది. వావ్, మీషో, అజియో, హెడ్ అండ్ షోల్డర్స్లాంటి ప్రముఖ సంస్థలకు ప్రకటనలు చేసిందీ భాను.
‘కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నా. కాలేజీ నుంచి ఇంటికొచ్చాక ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు సరదాగా డ్యాన్స్ వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పెట్టేదాన్ని. కొద్దికాలంలోనే వాటికి ఊహించనంత పేరొచ్చింది. సౌత్ క్రియేటర్స్‌లో నేను టాప్‌లో నిలవడం మర్చిపోలేని అనుభూతి. తక్కువ సమయంలోనే ఇన్స్టాగ్రామ్ భాగస్వామ్యంతో ప్రమోషన్ వీడియోలు చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నా. ఈటీవీలో ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’, ‘బెస్ట్ హాఫ్’, ‘జబర్దస్త్’లో పనిచేసే అవకాశం వచ్చింది. తొలిసారి ‘అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటీ’ షోలో కనిపించా. ఆ సందర్భంగా చేసిన వానా వానా వెల్లువాయె పాట ప్రోమో మంచి పేరు తెచ్చిపెట్టింది. మాది విజయవాడ. అమ్మానాన్న వ్యాపారం చేస్తారు. నా ఆసక్తిని గమనించి బాగా ప్రోత్సహిస్తుంటారు. అక్క, అన్నయ్య నాకు మంచి విమర్శకులు’.-భాను
రాత్రికి రాత్రే గుర్తింపు
- ఫాలోవర్లు: 12 లక్షలు