భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. కాసేపట్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సమావేశం కానున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌లు, డీఐజీ, ఇతర అధికారులతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఈ భేటీలో పాల్గొన్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలని నిన్న మంత్రివర్గ ఉపసంఘం సూచనతో.. భూముల విలువ పెంపునకు విధి విధానాలు, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు.
భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం - value-addition-of-land-registration in telangana

09:02 June 30
భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం
ప్రాంతాలవారీగా ప్రభుత్వ నిర్దేశిత విలువలు, ప్రస్తుత మార్కెట్ విలువలు పరిశీలన, వాణిజ్య ఆస్తుల విలువ పెంపుపై సమీక్షించనున్నారు. సాధారణ ఆస్తులు, ఇల్లు, ఖాళీ స్థలాలు, భూముల విలువల పెంపుపై చర్చిస్తారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల పరిశీలన అనంతరం, ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశముంది.
వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల పరిశీలన, తెలంగాణలో పెంపునకు ఎంత అవకాశము ఉందో చర్చిస్తారు. ప్రాంతాల వారిగా వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీల ప్రతిపాదనల మేరకే విలువల పెంపు ఉంటుందని, అది కూడా ఆగస్టు నుంచి కానీ, ఆ తర్వాత కానీ అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వాణిజ్య ఆస్తులకు చెందిన డోర్ నంబర్లు సేకరించాలని సబ్ రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఆదేశించారు. ఇప్పటికే కొన్ని డోర్ నంబర్లు రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉండగా... పూర్తి వివరాలను కార్పొరేషన్లు, పురపాలక సంఘాల నుంచి సేకరించాలని నిర్ణయించారు.
మంగళవారం భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించింది. ప్రభుత్వ నిర్ధారిత విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు, ఇండ్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు రుణాలు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీకి అధికారులు వివరించారు. వీటిని తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా ధరలను సవరించాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
వీటన్నింటి నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుము సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి ఉపసంఘం వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయించింది.