తెలంగాణ

telangana

ETV Bharat / city

చదువు చాటున గంజాయ్‌... సరఫరా, వినియోగంలో విద్యార్థులు ముందు! - చదువుచాటున గంజాయ్‌

విద్యార్థులే లక్ష్యంగా రాష్ట్రంలో గంజాయి మాఫియా కోరలు చాస్తోంది. తొలుత విద్యార్థులకు ఆ మత్తును అలవాటు చేసి... తర్వాత ఒక్కొక్కర్ని ఉచ్చులోకి లాగుతూ మాదకద్రవ్యాల విష వలయంలో చిక్కుకునేలా చేస్తోంది. వారిని అడ్డం పెట్టుకుని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సరఫరా గొలుసు విస్తరిస్తోంది. గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తూ, వినియోగిస్తూ పట్టుబడిన, పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉండటం కలవరపరిచే అంశం.

studying-cannabis-dot-dot-dot-students-play-a-vital-role-in-supply-and-consumption
చదువు చాటున గంజాయ్‌

By

Published : Dec 5, 2019, 11:54 AM IST

తమ మార్కెట్‌ విస్తరణలో భాగంగా అంతర్జాతీయ, అంతర్‌రాష్ట్ర మత్తు ముఠాలు ఏపీని కేంద్రంగా చేసుకుంటున్నాయి. సిగరెట్‌, మద్యం తాగే అలవాటున్న విద్యార్థుల్లో సులువుగా ప్రలోభాలకు ఆకర్షితులయ్యే వారిని గంజాయి ముఠా సభ్యులు ఎంపిక చేసుకుంటారు. తొలుత చిన్న గంజాయి పొట్లాలను ఉచితంగా అందించి అలవాటు చేస్తారు. తర్వాతి దశల్లో డబ్బు వసూళ్లకు దిగుతారు. ఆ మత్తు లేకుండా ఉండలేని పరిస్థితుల్లోకి నెట్టి... వారినే సరఫరాదారులుగా మార్చుకుంటారు. గంజాయి కొనుగోలు, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం విద్యార్థులు సరఫరాదారులుగా మారుతున్నారు.

20-30 శాతం కమీషన్‌

గంజాయి సరఫరా చేసే విద్యార్థులకు 20-30 శాతం వరకూ కమీషన్‌ అందిస్తున్నారు. అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు దీన్ని పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొస్తున్నారు. విద్యార్థులైతే కళాశాలల్లో ఎక్కువ మందితో సంబంధాలుంటాయని, సులువుగా అలవాటు చేయించగలరనే ఉద్దేశంతో మత్తు ముఠాలు వారినే ఎంపిక చేసుకుంటున్నాయి.

చదువు చాటున గంజాయ్‌

పట్టుబడుతున్న విద్యార్థులు..

  • గత మూడేళ్లలో పట్టుబడిన వారిలో 91 మంది విద్యార్థులే. వీరిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ తదితర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారే.
  • పోలీసులకు చిక్కిన వారిలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నారు.
  • పర్యాటకుల ముసుగులో ఏపీలోని విశాఖ మన్యానికి చేరుకుని సరుకు కొనుగోలు చేసి కార్లలో తరలిస్తున్నారు.
  • ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు.
  • విజయనగరం జిల్లాలో ఈ ఏడాది మే 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వీరి కారులో 20 కిలోల గంజాయి దొరికింది.

ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాలతోపాటు మహారాష్ట్రకు చెందిన అయిదుగురు విద్యార్థులు తమిళనాడులోని కళాశాలలో చదువుతున్నారు. వీరు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. విశాఖ మన్యంలో కిలో రూ.3 వేలుకు కొనుగోలు చేసి.. తమిళనాడులో రూ.12 వేలకు అమ్ముతున్నారు. విశాఖ నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తూ ఇటీవల కావలిలో పోలీసులకు చిక్కారు.

73822 96118 కు వాట్సప్‌ చేయండి

‘‘మాదకద్రవ్యాల, గంజాయి స్మగ్లింగ్‌, అక్రమ రవాణాపై నిఘా పెంచాం. డీజీపీ ఆదేశాలపై విస్తృత తనిఖీలు చేస్తున్నాం. వీటిపై సమాచారాన్ని 7382296118 వాట్సప్‌ నంబర్‌కు తెలియజేయొచ్చు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. వారికి పారితోషకమూ ఇస్తాం’’ అని సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌ కోరారు. టోల్‌ఫ్రీ నంబర్లు... 14500, 1800-425-4868కు కాల్‌ చేసి సమాచారమివ్వొచ్చని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ పి.హరికుమార్‌ తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో..

గంజాయి మత్తుకు అలవాటుపడ్డ విద్యార్థులు, సరఫరాదారులు సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. రహస్య సంకేత భాష వినియోగిస్తున్నారు. వివిధ రకాల క్రీడా టోర్నమెంట్ల పేరిట యువతను ఆకర్షించి... ఆ మైదానాల్లోనూ గంజాయిని అలవాటు చేయిస్తున్నారు. ఒకప్పుడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఒకరో, ఇద్దరో సరఫరాదారులు ఉండేవారు. విద్యార్థులే సరఫరాదారుల అవతారమెత్తాక ఆ సంఖ్య ఇప్పుడు వందల్లోకి పెరిగిపోయింది.

మన్యంలో రూ.2 వేలు..బయట అంతకు అనేక రెట్లు

  • విశాఖపట్నం మన్యంలో లభించే శీలావతి గంజాయికి దేశంలోనే చాలా గిరాకీ ఎక్కువ. మన్యంలో కిలో రూ.2 వేలకు లభించే గంజాయి...ఇతర ప్రాంతాల్లో కిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ పలుకుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర నగరాలు సహా చిన్న పట్టణాల్లోనూ విద్యార్థులకు పొట్లాల రూపంలో అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.200 - రూ.300 ఉంటోంది.

ఇదీ చదవండి: పైశాచిక ఆనందంలో యువత

ABOUT THE AUTHOR

...view details