వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న జరగాల్సిన ‘నీట్’ వాయిదా పడింది. ఇతర పరీక్షలదీ అదే బాట. స్వదేశంలోనే కాదు, విదేశాల్లో వైద్య విద్యలో చేరాలనుకునే భారతీయ విద్యార్థులు కూడా నీట్ ద్వారానే ప్రవేశార్హత పొందాలి. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అనివార్యంగా జరిగిన జాప్యం గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకూడదు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య సంబంధిత ఉన్నత విద్యా ప్రవేశానికీ, బీ ఫార్మసీకీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్ ద్వారానే ప్రవేశం! అందుకే బైపీసీ విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. ప్రధాన అంశాల పునశ్చరణపై, మననంపై దృష్టిపెట్టాలి!
నీట్, ఎంసెట్..రెండు పరీక్షలకూ బహుళైచ్ఛిక ప్రశ్నలున్న ప్రశ్నపత్రాలే ఉంటాయి. నీట్‌లో ప్రతి తప్పు సమాధానానికీ -1 మార్కు కోత ఉంటుంది. ఎంసెట్‌లో నెగెటివ్ మార్కులు లేవు. తప్పుగా సమాధానం గుర్తించినా ప్రత్యేకించి జరిగే నష్టం లేదు.
పరీక్ష సిలబస్, పుస్తకాలు
నీట్ గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఒకటి లేదా రెండు ప్రశ్నలను సిలబస్ పరిధి దాటి అడిగినట్లు అర్థమవుతుంది. అభ్యర్థులు అత్యుత్సాహంతో సిలబస్ పరిధి దాటి అదనపు విషయాలపై మరీ ఎక్కువగా తయారవటం అంత అభిలషణీయం కాదు. నీట్ పరీక్షకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఎంసెట్‌కు తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అంశాలు, అధ్యాయాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ఈ రెండు సిలబస్‌లకు ఉన్న సారూప్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను చదువుకోవడం అత్యుత్తమం. మార్కెట్‌లో లభ్యమవుతున్న రకరకాల మెటీరియల్స్, గైడ్లతో పోల్చుకుంటే పైన పేర్కొన్న పుస్తకాలతో రెండు పరీక్షలకు సన్నద్ధమవడం చాలా తేలిక.
ఇలా చదివితే మేలు..
- సబ్జెక్టును చదువుతున్నపుడే దానిలో ప్రతి అధ్యాయానికీ సంబంధించిన వివిధ కాన్సెప్టులు, అంశాలపై షార్ట్‌నోట్సు తయారుచేసుకోవాలి. దీన్ని పునశ్చరణకు ఉపయోగించుకుంటే నీట్‌కూ, ఎంసెట్‌కూ ఉపయుక్తం.
- సబ్జెజెక్టుల వారీగా ముఖ్యమైన సమాచారాన్ని పట్టికలు, బొమ్మలు లేదా షార్ట్‌కట్ పద్ధతుల ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. సమయం ఆదా అవ్వడంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
- సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్ని సాధన చేయడానికి తగిన సమయాన్ని కేటాయించుకోవాలి.
- వీలైనన్ని మాక్ టెస్టులు ప్రాక్టీస్ చెయ్యాలి. ముఖ్యంగా ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యేటపుడు కంప్యూటర్‌పై సాధన చెయ్యాలి. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ తర్వాత ఏ టాపిక్‌లలో సరైన సమాధానం గుర్తించలేదో గమనించి ఆ టాపిక్‌లను రివైజ్ చేసుకుంటూ ఉండాలి.
- ప్రాక్టీస్ టెస్టులు రాస్తున్నపుడే ఎంత సమయం పడుతోందో వాచీ ద్వారా అంచనా వేయాలి. తగిన వేగం, కచ్చితత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇలా సమయపాలనపై పూర్తి పట్టు సాధించాలి.
ఏ సబ్జెక్టు ఎలా?
కెమిస్ట్రీ
నీట్, ఎంసెట్ రెండిటిలోనూ 90 శాతం పైగా ప్రశ్నలు తేలికగానే ఉంటున్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలు ఇచ్చే అవకాశం ఎక్కువ. ఈ విభాగంలో ప్రాథమిక భావనలనూ, తగిన ఫార్ములానూ వాడే విధానాన్ని అభ్యాసం చేయాలి. ఈ విభాగంలో దృష్టి సారించాల్సిన ముఖ్య అధ్యాయాలు- సొల్యూషన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ కైనెటిక్స్, స్ట్టేట్స్ ఆఫ్ మేటర్, థర్మోడైనమిక్స్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి థియరీ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.
మూలకాలకు సంబంధించిన విభిన్న గ్రూపుల వివరాలు నోట్సులా రాసుకుని వీలైనన్నిసార్లు చదువుకోవాలి. మూలకాల విభిన్న ధర్మాలు, వాటి సారూప్యతలు, అసమానతలు వంటి వాటిని పట్టిక రూపంలో రాసుకుని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. మూలకాలు, సమ్మేళనాల భౌతిక, రసాయనిక ధర్మాలు, తయారీ విధానాలను గుర్తుపెట్టుకోవాలి. సిలబస్‌లో ఇచ్చిన గ్రూపులకు సంబంధించిన ఆక్సైడులు, హాలైడులు, కార్బొనేట్లు గురించి అధ్యయనం చేయాలి.
కెమిస్ట్రీ ఇన్ ఎవిరిడే లైఫ్, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ లాంటి అధ్యాయాలను ఎన్‌సీఈఆర్‌టీ, అకాడమీ పుస్తకాల్లో ఇచ్చిన వివరణలు చదివితే చాలు.ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అత్యంత కీలక విభాగం. దీనిని చదివేటప్పుడు సహనం, నేర్పు రెండూ అవసరం. ఈ విభాగంలో నేమ్‌డ్ రియాక్షన్స్, ఐసోమెరిజం, రియాక్షన్ మెకానిజమ్స్ ముఖ్యమైనవి. వీటితోపాటు మిగిలిన అంశాలను విస్మరించకుండా చదవాలి.
బయాలజీ
నీట్, ఎంసెట్ రెండు ప్రశ్నపత్రాల్లో 50 శాతం మార్కులు ఈ విభాగం నుంచే ఉంటాయి. అంతేకాకుండా ఈ సబ్జెక్టులో అడిగే ప్రశ్నలు చాలావరకూ చదవగానే సమాధానం గుర్తించే స్థాయిలోనే ఉంటాయి. అందుకే మొదటగా ఈ సబ్జెక్టుతోనే పరీక్ష ఆరంభించడం శ్రేయస్కరం. ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేస్తే అధికంగా మార్కులు తెచ్చుకోవచ్చు.
బోటనీలో మొక్కల వర్గీకరణ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. మొక్కలకు సంబంధించిన అనేక ముఖ్యాంశాలను మార్ఫాలజీలో గమనించవచ్చు. ఈ రెండు అధ్యాయాల్లో సిలబస్ పరంగా కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ వివరణలతో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలున్నాయి. కాబట్టి అధ్యాపకుల సూచనలను పొందితే మేలు. ప్లాంట్ ఫిజియాలజీ అధ్యాయంలో వాటర్ రిలేషన్స్, మినరల్ న్యూట్రిషన్స్ వంటి అంశాల్లో పరిజ్ఞానపరంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.