కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా అనేక వ్యాపారాలు మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వసతుల లేమి.. కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అరకొర సదుపాయాలతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్ర సమీపంలోని ఓనకడిల్లి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావడానికి ప్రతిరోజూ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
ఆన్లైన్ క్లాసుల కోసం 5 కిలోమీటర్ల ప్రయాణం.. రోడ్లపైనే పాఠాలు - students travel to 5km to listen online classes
టెక్నాలజీ ఊపందుకుంటోంది.. ఇక అంతా డిజిటల్ మయమే .. అంతా ఆన్లైన్లోనే అంటూ ఎక్కడ చూసినా ప్రచారం జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ మొబైల్ నెట్‌వర్క్‌ల సిగ్నల్ కోసం కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సి వస్తోంది. డిజిటల్ భారతం అంటున్నాం కానీ.. కొన్ని గ్రామాల్లో ఆన్లైన్ క్లాసులు వినేందుకు సిగ్నల్స్ అందక విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరం వస్తున్నాారు. అక్కడ సిగ్నల్ అందినా నెట్ స్పీడ్ సరిగా రాకపోవడంతో.. లోపల కూర్చోకుండా రోడ్డుపైనే కూర్చుని క్లాసులు వింటున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని విద్యార్థులు మొబైల్ సిగ్నల్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అంత దూరం ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జియో సిగ్నల్‌పై ఆధారపడుతున్నారు. ఓనకడిల్లి, మాచ్ఖండ్లలో బీఎస్ఎన్ఎల్ సేవలు ఉన్నప్పటికి అంతర్జాలంలో వేగం లేక నడిరోడ్డుపైనే విద్యార్థులు పాఠాలు వినాల్సివస్తుంది. మాచ్‌ఖండ్, ఓనకడిల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్ధులు విశాఖపట్నం, భువనేశ్వర్, కొరపుట్, జయపురం పట్టణాల్లో ఉన్నత విద్య చదివారు. లాక్డౌన్ కారణంగా వారంతా .. స్వస్థలానికి వెళ్లారు. ఇప్పుడు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇలా కష్టాలు పడుతున్నారు.
ఇదీ చదవండి:ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు సర్కారు కసరత్తు