తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీఎంసెట్ నిర్వహణపై సందేహాలు.. హైదరాబాద్‌లోని కేంద్రాల్లో పరీక్షపై సందిగ్ధం - ఏపీ ఎంసెట్ 2020

రోజురోజుకూ కరోనా కోరలు చాస్తున్న వేళ.. ఏపీ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల ఉద్ధృతితో... ఈనెల 27 నుంచి జరగాల్సిన పరీక్ష జరపడం ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులకు పరీక్ష హైదరాబాద్‌లో నిర్వహించాల్సి ఉండగా... అక్కడా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈనెల 27 నుంచి జరగాల్సిన ఏపీ ఎంసెట్ -2020 నిర్వహణ... ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి

ఏపీఎంసెట్ నిర్వహణపై సందేహాలు
ఏపీఎంసెట్ నిర్వహణపై సందేహాలు

By

Published : Jul 11, 2020, 9:02 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఎంసెట్‌ నిర్వహణపై అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతంలోనే నిర్ణయించగా కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆలోచనలో పడ్డారు. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకి ఉంటే పరీక్షకు విద్యార్థి హాజరు కావొచ్చా.? అభ్యర్థికే కరోనా సోకి ఉంటే పరీక్ష ఎలా రాయాలి? అసలు ఈ నెల్లో ఎంసెట్‌ ఉంటుందా. ఉండదా? అంటూ... కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయకేంద్రాలకు ఫోన్లు.. అధికారులకు ఈ మెయిళ్లు హోరెత్తుతున్నాయి.

కేంద్రాలు మార్పు

ఏపీ-ఎంసెట్‌కు మొత్తం 2 లక్షల 71 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మొదట 167 పరీక్ష కేంద్రాలు కేటాయించగా ప్రస్తుతం ఈ సంఖ్య 146కు తగ్గింది. మరోవైపు విద్యాసంస్థల మూసివేతతో చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించడం వల్ల చదువుతున్న నగరాల బదులు సొంతజిల్లాలను ఎంచుకున్నారు. ఫలితంగా విజయవాడలో పరీక్షా కేంద్రాల తగ్గి ఆయా జిల్లాల్లో పెరిగింది. ఇప్పటివరకు సుమారు 15 వేలమంది ఇలా పరీక్షాకేంద్రాలు మార్చుకున్నారు.

హైదరాబాద్​లో పరీక్ష ఎలా?

తెలంగాణలో ఎంసెట్ పరీక్ష కేంద్రాలుగా ఉన్న 23 కళాశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపైనా ఇప్పటివరకూ స్పష్టత లేదు. పరీక్షలకు దాదాపు 1100 మంది వరకూ ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకులు అవసరమని అంచనా. వీరి ఎంపిక ఎంతవరకూ వచ్చిందన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఏపీ ఎంసెట్‌కు సుమారు 22 వేలమంది తెలంగాణ విద్యార్థులూ దరఖాస్తు చేసుకున్నారు. వీరికి హైదరాబాద్‌లోనే నాలుగు పరీక్షాకేంద్రాలు కేటాయించారు. ఐతే ఇప్పటివరకూ ఈ కళాశాలలను కన్వీనర్ సహా ఇతర అధికారులూ పరిశీలించలేదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున అక్కడ పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

ఎంసెట్ నిర్వహణపై విద్యార్థుల్లో సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ ఉమ్మడి ప్రవేశపరీక్షల కన్వీనర్లతో ఇవాళ ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్ సహా ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :జడలువిప్పిన కరోనా...ఒక్కరోజులో 1608 కేసులు

ABOUT THE AUTHOR

...view details