తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐశ్వర్యది వ్యవస్థ చేసిన హత్య : విద్యార్థి సంఘాలు - Aishwarya Reddy's suicide in Delhi

తెలుగు విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య ఉదంతంపై దిల్లీలో సోమవారం విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెది వ్యవస్థ చేసిన హత్య అని మండిపడ్డాయి. వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలంటూ ఆందోళనలకు దిగాయి.

student unions protest demanding  justice for Aishwarya reddy's death
ఐశ్వర్య మృతిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

By

Published : Nov 10, 2020, 8:23 AM IST

దిల్లీలోని లేడీ శ్రీరామ్‌(ఎల్‌ఎస్‌ఆర్‌) కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఈ నెల 3వతేదీ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్రానికి, విద్యామంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ లేడీ శ్రీరాం కాలేజీ విభాగం ప్రధాన కార్యదర్శి ఉన్నిమయా, ఎస్‌ఎఫ్‌ఐ దిల్లీ సహాయ కార్యదర్శి మౌనిక శ్రీసాయి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐసీ ఘోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి దీప్షితాదార్‌ మాట్లాడుతూ..సకాలంలో ఉపకార వేతనం వచ్చివుంటే ఐశ్వర్య ఆత్మహత్య చేసుకునేది కాదన్నారు. ఐశ్వర్య తల్లి సుమతి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ.. రూ.40 వేలు సమకూరి ఉంటే తమ కూతురు బతుకు మరోలా ఉండేదన్నారు. చదువు మధ్యలో ఆగిపోతే నవ్వులపాలవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకుందని వాపోయారు.

ఐశ్వర్య ఆత్మహత్య ఘటనకు నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్రానికి, మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఐశ్వర్య మృతిపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘జస్టిస్‌ ఫర్‌ ఐశ్వర్య’ పేరుతో చేపట్టిన ట్విటర్‌ ఖాతాకు పలువురు తమ ట్వీట్లు జతచేశారు. ప్రధాని మోదీ తన ప్రచారానికి రూ.713కోట్లు వెచ్చించారని.. ఉపకార వేతనాలు మాత్రం విడుదల చేయలేదని విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వాల నుంచి కనీస సహకారం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని దిల్లీ తెలుగు విద్యార్థి సంఘం నేత టి.వివేక్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:విద్యార్థిని ఆత్మహత్య.. ఆర్థిక పరిస్థితులే కారణం

ABOUT THE AUTHOR

...view details