తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు - హైదరాబాద్​లో ట్రాఫిక్‌ మార్షల్స్‌

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు పోలీసులు కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం సహా వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. రెండు రోజుల్లో వేలాది మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

lockdown in telangana
తెలంగాణలో లాక్​డౌన్​

By

Published : May 24, 2021, 5:47 AM IST

హైదరాబాద్‌లో గడిచిన రెండురోజులుగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతోంది. పోలీసు ఉన్నతాధికారులే రహదారులపై నిల్చొని నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. శనివారం భారీఎత్తున వాహనాలను సీజ్‌ చేయడంతో అనవసరంగా బయటకు వచ్చే వారిసంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రి వేళల్లోనూ ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి.

ట్రాఫిక్‌ మార్షల్స్‌..

లాక్‌డౌన్‌ విధుల్లో పోలీసులకు సహకరించేందుకు రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ మార్షల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వారు చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో పాటు విధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని చోట్ల ట్రాఫిక్‌ మార్షల్స్‌ సేవలు ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం.. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిబంధనలు ఉల్లంఘించిన.. 2,452 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు 35 వేల కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాల్లోనూ..

జిల్లాల్లోనూ.. లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. సడలింపుల సమయం పూర్తైన తర్వాత అనవసరంగా రహదారిపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వెయ్యికి పైగా.... వాహనాలు సీజ్ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2 వేల 281 ఉల్లంఘన కేసులు సహా... 156 వాహనాలను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లాలో 158 వాహనాలు సీజ్ చేసి 3,500 కేసులు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే సిరిసిల్ల వీధుల్లో బైక్‌పై తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 15 వాహనాలు సీజ్ చేయడం సహా 28 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

సడలింపు సమయంలో వచ్చిన కొడుతున్నారు!

నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి సిబ్బందికి సూచించారు. కాలనీలు, వీధుల్లో లాక్‌డౌన్‌ అమలయ్యేలా ప్రత్యేక బైక్‌ పెట్రోలింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. హన్మకొండ కాకతీయ వర్సిటీ వద్ద ఆస్పత్రికి వెళ్తున్న ఒకరు, దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద ముజాహీద్‌ అనే వ్యక్తిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. సడలింపు సమయంలో బయటకు వెళ్తే ఇష్టారీతిగా దాడి చేశారని బాధితులు వాపోయారు.

ఇవీచూడండి:విమర్శలు మూటగట్టుకుంటున్న పోలీసుల 'లాఠీ' ప్రతాపం

ABOUT THE AUTHOR

...view details