బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వానతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందిపడ్డారు. ట్యాంక్ బండ్‌పై కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
రెండ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వరద జోరు కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కారేపల్లి మండలంలోని బుగ్గవాగుకు వరద పోటెత్తడం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి లోతువాగు, ఇసుక వాగులు పొంగి పొర్లుతున్నాయి. సీతారామ ప్రాజెక్టుకు వరుణుడి జోరు అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మూడ్రోజులుగా సీతారామ పనులు ముందుకు సాగడం లేదు.
రహదారులు జలమయం
వరంగల్‌లో జోరుగా వర్షం కురుస్తోంది. హన్మకొండలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల సబ్ డివిజన్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దామెర చెరువు పూర్తిగా నిండడం వల్ల..పెద్ద చెరువు, చాలివాగు అలుగు పారుతున్నాయి. వర్ధన్నపేటలో ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాలెంవాగు ప్రాజెక్టు నిండుకుండలా మారడం వల్ల నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని మున్నేరు, దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగులు వరదనీటితో పొంగి పొర్లుతున్నాయి. భద్రకాళి జలాశయం మత్తడి పోస్తుండడం వల్ల స్థానికులు అక్కడకు చేరుకుని ఉల్లాసంగా గడిపారు.