తెలంగాణ

telangana

ETV Bharat / city

PULICHINTALA: స్టాప్​లాక్ అమర్చేందుకు ప్రయత్నాలు.. అందులోనూ అవరోధాలు - గుంటూరు జిల్లా వార్తలు

పులిచింతల డ్యాం వద్ద స్టాప్‌లాక్‌ గేటు పనులకు అవరోధాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. ముందస్తు పనులకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న గుత్తేదారు. నేడు పనులు పూర్తిచేయాలనే యోచనలో యంత్రాంగం ఉంది.

stop-lock-gate-arrangement-works-at-pulichintala
తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు.. అడ్డుకట్టకు ఆటంకాలు

By

Published : Aug 7, 2021, 7:30 AM IST

పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటుచేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. అందుకు అవసరమైన ఏర్పాట్లలోనే యంత్రాంగం, బెన్‌కాం ప్రతినిధులు తలమునకలై ఉన్నారు. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీగా పెరగడంతో జలాశయాన్ని ఖాళీ చేయించడం ఆలస్యమైంది. ఈ కారణంగానే తాత్కాలిక గేటు నిర్మాణ పనులు శుక్రవారం చేపట్టలేకపోయారు. జలాశయంలో నీటిమట్టం శుక్రవారం రాత్రికి 8 టీఎంసీల స్థాయికి చేరుకుంది. అయితే రాత్రి కావడంతో పనులు చేపట్టడం సాధ్యం కాదని భావించి శనివారం ఉదయం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. సాధ్యమైనంత వరకూ స్టాప్‌లాక్‌ గేటు అమర్చాలని 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం సగటున 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపడంతో రాత్రికి జలాశయం అనుకున్న మేరకు ఖాళీ అయింది.

చకచకా పనులు..

నాగార్జునసాగర్‌, తుపాకులగూడెం, పోలవరం నుంచి 25 మంది నిపుణులు తరలివచ్చారు. అసోం తదితర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ వారు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. గేటు నిర్మాణానికి వీలుగా చేపట్టాల్సిన ముందస్తు పనులకు బెకాన్‌ కంపెనీ బృందం శ్రీకారం చుట్టింది. జలాశయానికి సాగర్‌ నుంచి 5.11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. విరిగిన గేటు మరమ్మతులకు గాంట్రీ క్రేన్‌ను సిద్ధం చేసినట్లు ఎస్‌ఈ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి నీళ్లు 41 మీటర్ల స్థాయిలో ఉన్నాయి. పనులు చేయడానికి 36 మీటర్ల వరకు నీటిమట్టం తగ్గాలి శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 37 టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు జలవనరుల శాఖ వర్గ్గాలు తెలిపాయి. 22 గేట్లకు 11 సెగ్మెంట్లు ఏర్పాటు చేయాలి. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కచ్చితమైన నిర్ధారణకు వచ్చి మార్కింగ్‌ ఇచ్చారు. సెగ్మెంట్లను తీసుకొచ్చారు. అయితే మధ్యలో క్రేన్‌ మొరాయించడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఒక్కో సెగ్మెంటును అమర్చడానికి 6-10 గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. ఒక్కో ఇనుప దిమ్మె ఏర్పాటు చేసేందుకు సుమారు గంట పడుతుంది. సాధ్యమైనంత వరకు శనివారం సాయంత్రానికి పనులు పూర్తిచేయాలని యంత్రాంగం, గేట్ల నిర్మాణ కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటుతోనే నీటి వృథాకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. మరోవైపు... తెలంగాణ జెన్‌కో అధికారులు, నీటిపారుదల నిపుణులు శుక్రవారం పులిచింతలకు చేరుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

ఇనుప దిమ్మెలు సిద్ధం..

స్టాప్‌లాక్‌ ఏర్పాటు కోసం అవసరమైన ఇనుప దిమ్మెలను ప్రస్తుతానికి సిద్ధం చేశారు. గతంలో గేట్ల వద్ద బిగించి ఉన్న ఆ ఇనుప దిమ్మెలను తొలగించి, 16వ నంబరు గేటు సమీపంలోకి వాటిని చేరుస్తున్నారు. ఒక్కో ఇనుప దిమ్మె బరువు 12 టన్నులకు పైగా ఉంటుంది. ఇలాంటి 11 దిమ్మెలను ఒక దానిపై ఒకటి ఏర్పాటుచేయాలి. మరోవైపు ఎగువ నుంచి వరదఆగిపోతే తిరిగి జలాశయం నింపుకోవడం కష్టమని భావించిన యంత్రాంగం సకాలంలోనే పనులు పూర్తి చేయించాలని భావిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గితే తప్ప పనుల నిర్వహణకు మార్గం సుగమం కాదు. గేటు నిర్మాణం పూర్తికాగానే తిరిగి డ్యాంలో నీటిని నిల్వ చేస్తామని, పులిచింతల ఎస్‌ఈ రమేష్‌బాబు తెలిపారు. గేటు నిర్మాణ పనుల కోసం నీళ్లు దిగువకు వదలడంతో నిన్నటి దాకా నిండుకుండను తలపించిన పులిచింతల డ్యాం శుక్రవారం కళ తప్పింది. పనులకు అసౌకర్యం ఏర్పడుతుందని శనివారం సందర్శకుల రాకపోకలు నిషిద్ధమని ప్రకటించారు.

ఇదీ చదవండి:Jobs in Telangana: పూర్తైన ఉద్యోగుల వర్గీకరణ.. నియామక ప్రక్రియ దిశగా అడుగులు

ABOUT THE AUTHOR

...view details