Jail Bharo: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి.. వార్షిక పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ కార్మికులు జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి స్పష్టం చేసింది. కార్మికుల నిరసనలో పాల్గొన్న సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి వారికి సంఘీభావం ప్రకటించారు.
అమ్మేస్తాం.. మూసేస్తాం అంటే చూస్తూ ఊరుకోం...
కరోనా కష్ట కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షల మందికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు అందిందని కార్మిక నేతలు చెప్పారు. పరిశ్రమ ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. అలాంటి పరిశ్రమను అమ్మేస్తాం, మూసేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు ప్రజలు బానిసలు కాదని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని అన్నారు. కేంద్రం తన నిరంకుశ ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Vizag Steel Plant Movement: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి..