తెలంగాణ

telangana

ETV Bharat / city

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న మధ్యంతర ఆదేశాలు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మంత్రివర్గం నిర్ణయం గవర్నర్ ఆమోదించి.. జీవో విడుదలయ్యే వరకు.. న్యాయ సమీక్ష జరపవద్దని ప్రభుత్వం వాదించింది. సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనకు దురుద్దేశాలున్నాయని పిటిషనర్ వాదించారు.

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

By

Published : Nov 20, 2019, 10:03 PM IST

Updated : Nov 20, 2019, 11:42 PM IST

రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను శుక్రవారం వరకు హైకోర్టు పొడిగించింది. రూట్ల ప్రైవేటీకరణ అత్యవసరంగా చేయాల్సి ఉందని... మధ్యంతర ఉత్తర్వుల కారణంగా తదుపరి చర్యలు చేపట్టలేక పోతున్నామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏజీ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. శుక్రవారం వాదనలు పూర్తి చేస్తే... అదే రోజున తుది తీర్పు వెల్లడిస్తామని.. అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు

అంతర్గత మార్పిడి ఎలా అవుతుంది
మంత్రివర్గ నిర్ణయంపై సమీక్ష జరిపే అధికారం కోర్టులకు ఉండదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత.. దానికి అనుగుణంగా జీవో విడుదలయ్యాక.. సవాల్ చేయవచ్చునన్నారు. ప్రస్తుత దశలో న్యాయసమీక్ష జరపవద్దని కోరారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు. శాఖల మధ్య పరస్పర సమాచార మార్పిడిపై న్యాయ సమీక్ష జరపరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రివర్గం నిర్ణయం... శాఖల మధ్య అంతర్గత సమాచార మార్పడి ఎలా అవుతుందని ప్రశ్నించింది.

కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశం ఉంది
కేబినెట్ నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని.. వేల మంది ఆర్టీసీ కార్మికులపై ప్రభావం చూపనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన కొనసాగించారు. సహజ వనరులను ప్రైవేట్ పరం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో తెలిపిందని వాదించారు. రూట్ల సహజ వనరుల కావన్న హైకోర్టు... సంబంధం లేని విధంగా వాదించవద్దని అసహనం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లో కార్మికులు విధుల్లో చేరకపోతే రూట్లు ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారని.. కాబట్టి కేబినెట్ నిర్ణయం వెనక దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. తన వాదనకు మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను సమర్పించారు.

ఇదీ చదవండి: బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'

Last Updated : Nov 20, 2019, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details