తెలంగాణ

telangana

ETV Bharat / city

కొనసాగుతున్న వాయిదాల పర్వం... ఇబ్బందుల్లో స్థిరాస్తి వ్యాపారం - ధరణి వార్తలు

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 3 నెలలుగా నిలిచిపోవడం స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వ్యక్తిగత అవసరాల కోసం ఆస్తులను అమ్ముకోవాలని భావించిన వారికి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. రూ.కోట్లలో సొమ్ము వెచ్చించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన సంస్థలు, వ్యక్తులనైతే ఈ చర్య ఆర్థిక సమస్యల్లోకి నెట్టింది. రిజిస్ట్రేషన్లు జరగడం లేదనే కారణంతో బ్యాంకులు గృహ రుణాలు నిలిపివేయడం, కొనుగోళ్లు ఆగడంతో ప్రైవేటు వ్యక్తులకు వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నట్టు స్థిరాస్తి వ్యాపారులు వాపోతున్నారు.

stay continued from 3 months on non agriculture lands in telangana
stay continued from 3 months on non agriculture lands in telangana

By

Published : Dec 9, 2020, 6:41 AM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సెప్టెంబరు 8వ నుంచి నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 75 శాతానికి పైగా ఇవే ఉంటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 16,58,815 రిజిస్ట్రేషన్లు జరగ్గా... వ్యవసాయేతర సంబంధమైనవే 12 లక్షల దాకా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్లు, ఫ్లాట్లు, గృహాల విక్రయాలు నిలిచిపోవడంతో అవసరానికి అమ్ముకోలేక యజమానులు, కొనే వీలు లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలే కాకుండా అనేక పట్టణాల్లో స్థిరాస్తి రంగం బాగా విస్తరించింది. చిన్న చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో నిత్యం వందల సంఖ్యలో ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.

అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌ల రిజిస్ట్రేషన్‌ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం జోరుమీదున్న ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అనధికార అంచనా మేరకు సుమారు మూడు నెలల్లో మూడు, నాలుగు లక్షల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితి తమకూ ఇబ్బందిగా పరిణమించిందని ఎస్‌బీఐ సీనియర్‌ మేనేజర్‌ ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో సుమారు మూడు నెలలు గృహ రుణాలు దాదాపు నిలిచిపోయాయి. తాజాగా మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో గృహరుణాలు మరింత మందగించాయి. ఈ ఏడాది లక్ష్యాల్లో సగం కూడా పూర్తయ్యే పరిస్థితి కన్పించడం లేదని’ ఆయన అభిప్రాయపడ్డారు.

రద్దవుతున్న ఒప్పందాలతో భయంభయంగా

రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, ఎప్పుడు ఆరంభమవుతాయో తెలియకపోవడం, మరోవైపు ఆస్తుల విలువ పెరుగుతుండటం వంటి పరిస్థితుల్లో అనేకమంది ఆస్తుల కొనుగోళ్లు, విక్రయాల తాలూకూ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు. నిర్దేశించిన గడువులోపు విక్రయ ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతో బయానాలు వెనక్కి ఇచ్చేస్తున్న వారూ ఉన్నారు. ‘హైదరాబాద్‌తోపాటు, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నిత్యం వేల సంఖ్యలో క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. అన్నీ ఆగిపోవడంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని’ ఓ బిల్డర్‌వాపోయారు. నిర్మాణానికి భారీ మొత్తంలో ఖర్చు చేశామని, రిజిస్ట్రేషన్‌లు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు రాక ప్రైవేటు వ్యక్తులకు వడ్డీలు చెల్లించలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో అగ్రిమెంట్లు కూడా చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయం నెలకొనడంతో ఆ స్తుల అమ్మకాల్లో స్తబ్దత కొనసాగుతోందని’ స్థిరాస్తి వ్యాపారులు ఆయా సంఘాలకు విన్నవిస్తున్నారు.

వెంటనే ప్రారంభించకపోతే మరింత నష్టం

కరోనా పరిస్థితుల నుంచి బయటపడి హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం దేశంలో ఎక్కడా లేని విధంగా పుంజుకుంది. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్లు రద్దవడంతో వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించకపోతే మరింత నష్టం జరుగుతుంది. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ జరగాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే. వాటిని పూర్తిగా నిలిపివేయకుండా పాత విధానంలో కొనసాగిస్తూ నూతన విధానానికి అనుసంధానం చేసి ఉంటే బాగుండేది.

-జి.రామిరెడ్డి, అధ్యక్షులు, క్రెడాయ్‌, తెలంగాణ

పెళ్లి ఇంట అప్పుల తిప్పలు

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ వ్యక్తి డిసెంబరులో కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఖర్చుల కోసం ఇంటి స్థలాన్ని విక్రయించాలనుకున్నారు. నాలుగు నెలల క్రితం రూ.12 లక్షలకు విక్రయించారు. రూ.3 లక్షల బయానా తీసుకుని ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ ప్రకారం అక్టోబరులో రిజిస్ట్రేషన్‌ జరగాల్సి ఉంది. అది జరగకపోవడంతో విక్రయ ప్రక్రియ పూర్తికాలేదు. ‘దీంతో పెళ్లికి అవసరమైన సొమ్ము కోసం నానాపాట్లు పడుతున్నానని’ బాధిత వ్యక్తి ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మూడు నెలలుగా నిలిచిపోవడం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పే ఉదంతానికి ఇదో మచ్చుతునక.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10 వరకు స్టే పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details