తెలంగాణ

telangana

ETV Bharat / city

New Districts in AP: కొత్త జిల్లాల్లో మార్పులు చేయాలంటూ ధర్నాలు, శిరోముండనాలు

New Districts in AP : కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ల మార్పులతో పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రకటించిన వాటితో కాకుండా తమ ప్రాంతాలతోనే ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని..ఆయా సంఘాలు, ప్రజలు స్పష్టం చేశారు.

New Districts in AP: కొత్త జిల్లాల్లో మార్పులు చేయాలంటూ ఆందోళనలు, శిరోముండనాలు
New Districts in AP: కొత్త జిల్లాల్లో మార్పులు చేయాలంటూ ఆందోళనలు, శిరోముండనాలు

By

Published : Jan 30, 2022, 5:22 AM IST

New Districts in AP: లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌పై నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం బంద్‌ నిర్వహించారు. రాజంపేటలో పార్టీలకు అతీతంగా నిరసనలు జరిగాయి. పురపాలక సంఘంలో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలంటూ ఉద్యమం ఊపందుకుంది. ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలోనే కలపాలని కొందరు శిరోముండనాలు చేయించుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలతో మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండు తెరపైకి వచ్చింది.

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందే..

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలని అఖిలపక్షం ప్రతినిధులు డిమాండు చేశారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన హిందూపురం బంద్‌ విజయవంతమైంది. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని దుకాణాలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అంబేడ్కర్‌ కూడలిలో నిరసన కొనసాగుతుండగా బజరంగ్‌దళ్‌ విభాగ్‌ కన్వీనర్‌ నవీన్‌ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొనేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమీపంలో ఉన్నవారు వెంటనే రక్షించారు. విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

మార్కాపురం జిల్లా సాధనకు సమైక్య పోరాటం

కొత్త జిల్లాల ఏర్పాటులో తమకు అన్యాయం జరిగిందని, మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటుచేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండు చేశారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి ఎస్‌కె.సైదా అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ భావితరాల భవిత కోసం తమ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత కందుల నారాయణరెడ్డి ప్రసంగిస్తూ జిల్లాసాధన ఉద్యమానికి పశ్చిమప్రాంత ఎమ్మెల్యేలు మద్దతు తెలపాలన్నారు. అనంతరం ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

పడమటి ప్రజలకు తీరని అన్యాయం ..

చిత్తూరు జిల్లా పడమటి ప్రజలకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని శనివారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మదనపల్లె జిల్లా సాధన జేఏసీ, ఎన్టీఆర్‌ కూడలిలో మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ మద్దతు తెలిపారు. ‘మదనపల్లెను జిల్లా కేంద్రం చేయకపోవడం దురదృష్టకరం. మదనపల్లెకు దగ్గరగా ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని దూరంగా ఉన్న చిత్తూరులో కలిపారు’ అని మాజీ మంత్రి అన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో డీఏవో శేషయ్యకు అర్జీ సమర్పించారు. తెదేపా ఆధ్వర్యంలో నీరుగట్టువారిపల్లె నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. జనసేన ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్‌ వద్ద లక్ష పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు.

కడప, రాజంపేట కోసం తీర్మానాలు..

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ఆర్‌ అని కాకుండా కడప పేరు కొనసాగించాలని వివిధ పార్టీలు శనివారం తీర్మానించాయి. తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐలతో పాటు పలు ప్రజాసంఘాలు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి. రాజంపేటతో పాటు, అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో ఆందోళనలు మిన్నంటాయి. రాజంపేట పురపాలక సంఘం అత్యవసర సమావేశాన్ని ఛైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి నిర్వహించారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని, లేదంటే రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తమ ప్రాంతాలను కడపలోనే కొనసాగించాలంటూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. ఆర్టీసీ బస్టాండు నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండు వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తాళ్లపాకలో మహిళలు ర్యాలీ చేసి, అన్నమయ్య విగ్రహానికి పూలమాల సమర్పించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయని పక్షంలో పార్టీ, ప్రజాప్రతినిధుల పదవులకు రాజీనామా చేస్తామని ఒంటిమిట్టలో వైకాపా నాయకులు స్పష్టం చేశారు.

ద్వారకాతిరుమలను ఏలూరులో కలపాలి

ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలంటూ పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శనివారం తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఈ మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపా నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేసి, అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కొందరు నాయకులు శిరోముండనం చేయించుకున్నారు.

రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలి

రంపచోడవరం కేంద్రంగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు. శనివారం విశాఖ జిల్లా పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో రంపచోడవరం, చింతూరు, ఎటపాక, వి.ఆర్‌.పురం ప్రాంతాలను కలపడం వల్ల తూర్పు మన్యం వాసులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. పశ్చిమగోదావరి ఏజెన్సీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా మరో గిరిజన జిల్లా ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details