గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టి తరగతులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్కు లేఖ రాశారు. విశ్వవిద్యాలయం ప్రారంభం కోసం ఇక్కడి గిరిజన యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తోందని, వారి భవిష్యత్ దృష్ట్యా ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కోరినట్లు ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాల భూమిని గుర్తించినట్టు మంత్రి లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సూచనల మేరకు అసైన్డ్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు రూ.15 కోట్లు కేటాయించారని, తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు కోసం రూ. 2.90 కోట్లు కూడా మంజూరు చేశారని వివరించారు. గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ప్రారంభించడానికి జాకారంలో గుర్తించిన 115 ఎకరాల అసైన్డ్ భూమిని, 50 ఎకరాల అటవీ శాఖ భూమిని అప్పగించాలని మంత్రి కోరారు.