తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఏపీ పోలీసు అధికారుల సంఘం

Appalaraju issue: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని పరుష పదజాలంతో దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఏపీ పోలీసు అధికారుల సంఘం
అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఏపీ పోలీసు అధికారుల సంఘం

By

Published : Feb 11, 2022, 12:15 PM IST

Appalaraju issue: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాటి విశాఖ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని ఆ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. వెంటనే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.సోమశేఖర్‌రెడ్డి, విజయవాడ, పశ్చిమగోదావరి శాఖల అధ్యక్షులు ఎం.సోమయ్య, ఆర్‌.నాగేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు టి.పెద్దయ్య, కె.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగింది..

seediri appala raju: పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలోని శారదాపీఠం ముఖద్వారం వద్ద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బుధవారం ఉదయం మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్‌ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్‌నాయుడు అడ్డుకోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు.

‘సీఎం మాకు దేవుడు. ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం నచ్చితే రా.. లేకపోతే మానేయ్‌ అనడానికి ఎవడీయన. నాకు అర్థం కాదు. ఏయ్‌ బాబూ... తమాషాలు చేస్తున్నావా? చొక్కా పట్టుకొని లాగేస్తా (ఇక్కడో అసభ్యకర పదం వాడారు). పిచ్చిపిచ్చి వేషాలా? ఎలా కనిపిస్తున్నాం? మీ కమిషనర్‌ని రమ్మనండి. పిలిపిస్తారా లేదా? ఆ భాషకి మాకు అర్థం తెలియాలి కదా... ముందు సీపీని రమ్మనండి. మంత్రిని కదాని నాతోపాటు మా కుర్రోళ్లు సరదాపడి వచ్చారు. అందులో పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ ఉన్నారు. అలాంటిది ఆయన ఏమన్నాడో తెలుసా? నీకు నచ్చితే నువ్వు రా.. లేకపోతే నువ్వూ (సీఐ ఇక్కడ అసభ్యకర పదం వాడారని మంత్రి పేర్కొన్నారు). అదేంటో మాకు తెలియాలి కదా’ అని మండిపడ్డారు. ఆ తర్వాత ‘అయ్యా మీకో నమస్కారం’ అంటూ అక్కడి నుంచి వెనుదిరిగి కారులో వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న మంత్రిని పోలీసు అధికారులు సముదాయించేందుకు ప్రయత్నించారు. ఎంత బతిమిలాడినా అసహనం వ్యక్తం చేయడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఈ సమయంలో మంత్రి అనుచరులు సీఐని సస్పెండ్‌ చేయాలని, క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేశారు. మంత్రిని అడ్డుకున్న సీఐ ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details