తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు బ్యాంకర్ల సమావేశం.. వార్షిక రుణ ప్రణాళిక విడుదల! - వార్షిక రుణ ప్రణాళిక

వానాకాలం(ఖరీఫ్‌) పంటల సీజన్‌ ప్రారంభమై నెల దాటినా రైతులకు బ్యాంకులు పంటరుణాలు సరిగా ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో వ్యవసాయరంగానికి ఎన్ని రుణాలివ్వాలనే ‘వార్షిక రుణ ప్రణాళిక’(క్రెడిట్‌ ప్లాన్‌)ను ఇంతవరకూ ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’(ఎస్‌ఎల్‌బీసీ) విడుదల చేయలేదు. వానాకాలంతో పాటు వచ్చే అక్టోబరు నుంచి మొదలయ్యే యాసంగి(రబీ) సీజన్‌లో రైతులకు స్వల్పకాలిక పంటరుణాలు, పూచీకత్తుతో దీర్ఘకాలిక రుణాలు ఎంత ఇవ్వాలనేది ఈ ప్రణాళికలోనే వెల్లడిస్తారు.

state level bankers association to be held meeting today
state level bankers association to be held meeting today

By

Published : Jul 6, 2020, 9:18 AM IST

Updated : Jul 6, 2020, 9:24 AM IST

ఒక రైతు ఎకరా విస్తీర్ణంలో ఏ పంట వేశారనేది చూసి దానికి ఎంత రుణం ఇవ్వాలనే ‘రుణ పరిమితి’(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ని గత మార్చిలో ఎస్‌ఎల్‌బీసీ ఆమోదించింది. దాని ప్రకారం దాదాపు ఈ వానాకాలం సీజన్‌లో స్వల్పకాలిక పంటరుణాలుగా రూ.30,649 కోట్లు బ్యాంకులు రైతులకు ఇవ్వాలి. కానీ మార్చి చివరి నుంచి దేశంలో కొవిడ్‌ సంక్షోభం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌లో ఒక పంటకు నిర్ణయించిన రుణం మొత్తంలో మరో 10 శాతం అదనంగా కలిపి ఇవ్వాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది.

10 శాతమూ ఇవ్వలేదు

ఈ సీజన్‌లో పత్తి 60 లక్షల ఎకరాలు, వరి 41 లక్షల ఎకరాల్లో వేయాలని వ్యవసాయశాఖ నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చింది. ఆ లెక్కన 1.01 కోట్ల ఎకరాల్లో సాగయ్యే వరి, పత్తి పంటలకు రూ.42,218 కోట్లు ఇవ్వాలి. ఈ సీజన్‌లో కోటీ 25 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేయాలని లక్ష్యం. కానీ తొలుత నిర్ణయించిన రూ.30,649 కోట్లకు 10 శాతం కలిపి మొత్తం రూ.33,713 కోట్లు ఈ సీజన్‌లోనే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 30లోగా ఇవ్వాలి.

ఇప్పటికే 3 నెలలు గడచినా ఇందులో 10 శాతం రుణాలైనా బ్యాంకులివ్వలేదు. ఇక మిగిలిన 3 నెలల్లో దాదాపు రూ.30 వేల కోట్లు బ్యాంకులు ఇస్తాయా అనేది చూడాలి. నియంత్రిత సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి పత్తి, వరి సాగు పెంచాలని చెప్పినందున దాని ప్రకారం రుణ ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ మారుస్తుందా? లేదా? అనేది చూడాలి.

పాత బాకీ కట్టేసి..కొత్తది తీసుకుందామని

రాష్ట్రంలోని 42 లక్షల మంది రైతులకు గతేడాది వరకూ బ్యాంకులో పంటరుణ బకాయిలున్నాయి. రుణమాఫీ పథకం అమల్లో భాగంగా తొలి దశలో బ్యాంకులకు రూ.1,197 కోట్ల విడుదల ద్వారా రూ.25 వేలలోపు బాకీ ఉన్న 3.80 లక్షల మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.

ఈ క్రమంలో ఇక రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకూ బాకీ ఉన్నవారికీ నిధులు ఇస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ డబ్బులొస్తే పాతబాకీ కట్టేసి కొత్తరుణం తీసుకోవాలని రైతులు బ్యాంకులకు సరిగా రావడం లేదని ఓ అధికారి విశ్లేషించారు. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరగనుంది. వార్షిక రుణ ప్రణాళిను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో రుణాల పంపిణీ లక్ష్యాలు వెల్లడికానున్నాయి.

ఇవీ చూడండి:ఆ భయంతో 48 మంది వైద్యుల రాజీనామా!

Last Updated : Jul 6, 2020, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details