Ritunestham Foundation: సేంద్రీయ వ్యవసాయం, మిద్దెతోట పంటలు, అదనపు విలువ జోడింపుపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 16న హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్ పాఫ్సీ భవన్‌లో రైతునేస్తం ఫౌండేషన్, స్కిల్‌సాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సుకి ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన ఆహారం కోరుకుంటున్నారు. రసాయన ఎరువులు వాడకంతో విషతుల్యమైన పోషక విలువలు లేని ఆహార పదార్థాలతో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతోన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలు ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నిత్యజీవితంలో భాగమైన కూరగాయలు, పండ్లు, ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంటి బాల్కనీలు, ఆవరణ, మిద్దెలపై తక్కువ ఖర్చుతో తాజాగా పండించుకునేందుకు మొగ్గు చూపుతూ.. అనేక కుటుంబాలు చక్కటి సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ ప్రక్రియలో సమస్యలు, సవాళ్లూ వేధిస్తుండటంతో విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం లోటుగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు యడ్లపల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు.