తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వరవరరావును విడిపించాలి : ఐక్యవేదిక

వరవరరావు ఆరోగ్యం చాలా క్షీణించిందని... వెంటనే ఆయనను బెయిల్​పై విడుదల చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. 80 ఏళ్ళ వయసులో తన కుటుంబీకులను కూడా ఆయన గుర్తించలేకపోయారని ప్రతినిధులు విచారం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వరవరరావును విడిపించాలి : ఐక్యవేదిక
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వరవరరావును విడిపించాలి : ఐక్యవేదిక

By

Published : Aug 6, 2020, 4:13 PM IST

వరవరరావును వెంట‌నే విడుద‌ల చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ముంబాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావును వెంటనే బెయిల్​పై విడుదల చేయాలని ఐక్య వేదిక స్పష్టం చేసింది. భీమాకోరేగావ్ కేసులో అరెస్ట్ చేసి గత 23 నెలలుగా మహారాష్ట్రలోని తలోజా జైల్లో నిర్బంధించారని ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. 80 ఏళ్ళ వయసులో అనారోగ్యకర వాతావరణంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తన కుటుంబీకులను కూడా గుర్తించలేకపోయారని ప్రతినిధులు విచారం చేశారు.

అందరికీ సుపరిచతమే...

తెలుగు ప్రజలకు సుపరిచితమైన అభ్యుదయ వాది, అధ్యాపకునిగా ఎందరో విద్యార్థులకు మార్గదర్శనం చేశారన్నారు. కవిగా, రచయితగా, వక్తగా ఆయన తెలుగు ప్రజలపైనే కాక దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రభావం చూపించారని వివరించారు.

సమకాలీన సామాజిక అంశాలపై రచన..

స‌మ‌కాలీన సామాజిక స‌మ‌స్య‌ల‌పై ర‌చ‌న‌ల‌తో, క‌విత్వంతో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. వరవరరావు రచనలన్నీ భారతీయ భాషల్లోకే కాక, ఇంగ్లీష్, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి అనేక దేశాల భాషల్లోకి అనువాదమయ్యాయని పేర్కొన్నారు. జీవితమంతా ప్రజల కోసమే పోరాడుతూ అన్యాయాలను ప్రశ్నించారన్నారు. ఈ క్ర‌మంలో అనేక కుట్ర కేసులు ఎదుర్కొని అన్నింటిలోనూ నిర్దోషిగా నిరూపిత‌మయ్యారన్నారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వరవరరావుకు రెండేళ్ళుగా బెయిలు ఇవ్వకుండా వేధించటం సమంజసం కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు.

ఆయనకు బెయిల్ చాలా అవసరం...

అనారోగ్యంలో ఉన్న ఆయనకు కుటుంబ సభ్యుల తోడు, సంరక్షణ చాలా అవసరం కాబట్టి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు. వరవరరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక పక్షాన రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి, ముంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశామని ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వరవరరావును బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయించేందుకు చొరవ తీసుకోవాలని ఐక్యవేదిక కోరింది.

ఇవీ చూడండి :'శాంతిభద్రతల స్థాపనలో ఐపీఎస్​ల పాత్ర కీలకం'

ABOUT THE AUTHOR

...view details