యాసంగి పంట రైతుబంధు సాయం చెల్లింపుల కోసం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. 7,300 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు పది రోజుల్లో రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. ఏ ఆదేశాల నేపథ్యంలో నిధుల సమకూర్పుపై ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా 7,300 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంది.
రైతుబంధు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - raithu bandhu funds news
రైతుబంధు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 27 వరకు 7,300 కోట్ల రూపాయలను సమీకరించుకునే పనిలో పడింది. అందుబాటులో ఉన్న నిధులను సమీకరించుకోవడంతో పాటు కొత్తగా రుణాన్ని తీసుకోనుంది.
కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం భారీగా పడిపోగా... గత మూడు నెలలుగా కాస్తా పుంజుకుంటోంది. నెలనెలకూ ఆదాయం పెరుగుతూ వస్తోంది. రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కావడంతో కొంత ఆదాయం వస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో జీతభత్యాలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతుబంధు కోసం నిధులను సమీకరించే పనిలో అధికారులు పడ్డారు. రుణం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మరో రెండు వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీ బాండ్లను విక్రయించేందుకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్‌కు పంపింది. వాటిని 20 ఏళ్ల కాలానికి బాండ్లను జారీ చేయనుంది. ఇందుకు సంబంధిన వేలం ఈ నెల 22వ తేదీన జరగనుంది. బాండ్లు విక్రయం అయితే ఆ మొత్తం 24వ తేదీన ప్రభుత్వానికి అందుతుంది. వాటన్నింటి ద్వారా నిధులను సమకూర్చుకొని రైతుబంధు సాయాన్ని అందించనున్నారు.
నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వుల విడుదల తర్వాత రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు సాయం నగదును జమచేస్తారు.