తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలి: ఎస్​ఈసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటరు శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారధి అన్నారు. వివిధ పౌర సమాజ సంఘాల ప్రతినిధులతో ఎస్​ఈసీ సమావేశమై పోలింగ్​ శాతం పెంపు సహా పలు అంశాలపై చర్చించారు. రేపటిలోగా వందశాతం స్లిప్పులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్​ఈసీ తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పులు పంచవచ్చని పార్థసారధి తెలిపారు.

state election commissioner awareness on voting in ghmc elections
ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలి: ఎస్​ఈసీ

By

Published : Nov 24, 2020, 9:00 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని, పౌరసమాజ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. వివిధ పౌరసమాజ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఎస్ఈసీ... పోలింగ్ శాతం పెంపు సహా సంబంధిత అంశాలపై చర్చించారు. వివిధ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్లలో అవగాహన పెంపు, ఓటింగ్ శాతం పెంపు, ఎన్నికల్లో దుష్ప్రవర్తనలు, దుర్మార్గాలు ఆపడంలో పౌరసమాజ సంఘాల పాత్ర, బాధ్యత ఎంతో ఉంటుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2002లో 41.22శాతం, 2009లో 42.95శాతం, 2016లో 45.27శాతం పోలింగ్ నమోదైందని... ఈ శాతాన్ని ప్రస్తుత ఎన్నికల్లో పెంచేందుకు అందరూ కృషి చేయాలని పార్థసారధి చెప్పారు.

రేపటిలోగా స్లిప్పుల పంపిణీ..

పోలింగ్ స్లిప్పుల పంపిణీ గతంలో సక్రమంగా జరగలేదని... రేపటిలోగా వందశాతం స్లిప్పులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఓటరు స్లిప్పు అందితే తన ఓటు ఉందన్న నమ్మకం కలగడంతో పాటు పోలింగ్ కేంద్రం వివరాలు ముందుగా తెలియడం వల్ల ఓటు వేసేందుకు ముందుకు వస్తారని ఎస్ఈసీ అన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మాధ్యమాల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టామని... ప్రకటనలు, షార్ట్ ఫిలింల ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. సెలబ్రిటీల ద్వారా కూడా ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పులు పంచవచ్చని పార్థసారధి తెలిపారు.

అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి..

మురికివాడలు, క్లబ్బులు, వాకర్ అసోసియేషన్లు, అపార్ట్​మెంట్ సొసైటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా పౌరసంఘాలు అవగాహన సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్ స్థలాలు, నివాస ప్రాంతాల్లోనూ ఓటింగ్ శాతం పెంచేందుకు చర్చావేదికలు, సదస్సులు నిర్వహించాలని కమిషనర్ కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు, అవకతవకలు, దుర్వినియోగం లాంటి అంశాలను పౌరసమాజ సంఘాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని పార్థసారధి చెప్పారు.

ఇవీ చూడండి: పోస్టల్​ బ్యాలెట్​ దరఖాస్తు గడువు పెంపు: ఎస్​ఈసీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details