తెలంగాణ

telangana

ETV Bharat / city

'వివాహ విషయం చెప్పలేదంటూ బీమా తిరస్కరణ చెల్లదు'

పాలసీ తీసుకున్నపుడు వివాహం గురించి చెప్పలేదన్న కారణంగా పాలసీదారు మరణానంతరం వారసులకు పాలసీ చెల్లింపునకు నిరాకరించిన ఎల్‌ఐసీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తప్పుబట్టింది. పాలసీ మొత్తంతో పాటు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలన్న జిల్లా తీర్పును యథాతథంగా అమలు చేయాలంటూ అదనంగా మరో రూ.25 వేలు ఖర్చులు కింద చెల్లించాలని వరంగల్‌ ఎల్‌ఐసీని ఆదేశించింది.

State Consumer Commission
State Consumer Commission

By

Published : Jul 16, 2022, 9:49 AM IST

ములుగుకు చెందిన భద్రమ్మ రూ.లక్షకు 2007లో ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారు. 2012లో ఆమె మృతి చెందడంతో కుమారుడు ఎం.దేవ్‌సింగ్‌ పాలసీ సొమ్మును క్లెయిం చేయగా ఎల్‌ఐసీ తిరస్కరించింది. దీంతో ఆయన జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వివాహం గురించి వెల్లడించనందున పాలసీని తిరస్కరిస్తున్నట్లు చెప్పగా జిల్లా ఫోరం దాన్ని కొట్టివేస్తూ పాలసీ సొమ్మును బోనస్‌తో సహా 2013 నుంచి 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని ఎల్‌ఐసీని ఆదేశించింది.

దీన్ని సవాలు చేస్తూ ఎల్‌ఐసీ దాఖలు చేసిన అప్పీలుపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యురాలు మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఎల్‌ఐసీ నిర్ణయం అనుచితమని తప్పుబట్టింది. ఇప్పటికే ఉన్న అనారోగ్యం, ప్రతిపాదనకు ముందు ఆసుపత్రిలో చేరడం, వయస్సు, ఆదాయాన్ని తప్పుగా ఇవ్వడం, ఎక్కువ పాలసీలు పొందడం వంటి కారణాల వల్ల పాలసీని పొందినపుడు బీమాను తిరస్కరించిన సంఘటనలను చూశామని, వితంతువు, వివాహిత అన్న విషయం వెల్లడించనందున బీమాను తిరస్కరించిన సంఘటనలు తమ దృష్టికి రాలేదంది. బీమా చట్టం ప్రకారం పాలసీ జారీ చేసిన నాలుగేళ్ల అనంతరం ఎలాంటి వివాదాన్ని తెరపైకి తీసుకురాకూడదన్న ఆంక్షలు ఇక్కడ వర్తిస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఎల్‌ఐసీకి భారీగా జరిమానా విధించాల్సి ఉన్నా బాధితుడు అప్పీలు దాఖలు చేయనందున జిల్లా ఫోరం తీర్పునే సమర్థిస్తున్నామని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details