ఈటీవీ భారత్ కథనానికి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నుంచి స్పందన లభించింది.జోగులాంబ గద్వాల జిల్లా వీరాపురం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులపై.. "అక్కడే విద్యార్థుల చదువు.. అక్కడే తిండి, పడక"పేరుతో ఈటీవీ భారత్ కథనం ప్రచురించిది. కనీస వసతులు లేనందున సుమారు 300 మంది విద్యార్థుల ఇబ్బందులపై ప్రసారం చేసిన కథనాన్ని.. బాలల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కలెక్టర్‌కు నోటీసులు జారీ..
వీరాపురం గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్‌కు బాలల కమిషన్ స్పష్టం చేసింది. చర్యలు చేపట్టి నివేదికను సమర్పించాలంటూ కలెక్టర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈటీవీ భారత్ కథనాన్ని పరిశీలించిన కమిషన్... గురుకుల పాఠశాల సమస్యలను తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు నివసిస్తే.. వారి సమగ్ర అభివృద్ధి, కెరీర్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అద్దెభవనంలో ఆగచాట్లు..
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని వీరాపురంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ 5 నుంచి పదో తరగతి వరకూ 450 మంది విద్యార్దులు చదువుతున్నారు. ఈ నెల 21 నుంచి గురుకులాలు పునఃప్రారంభం కాగా... ప్రస్తుతం 300మంది వరకు తరగతులకు హాజరవుతున్నారు. అద్దె భవనంలో నడిచే ఆ గురుకులంలో ఆరంభం నుంచే ఆగచాట్లు మొదలయ్యాయి.
మంచినీరు కూడా లేని దుస్థితి..
గురుకులంలోని వసతి గదులే.. ఉదయం తరగతి గదులు. వాటినీ క్రమం తప్పకుండా ఊడ్చేదిక్కు లేదు. అక్కడే తినడం, చదువుకోవటం, పడుకోవడం. ఇరుకైన గదుల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్ సమస్యలతో ఫ్యాన్లు, బోర్లు కాలిపోయాయి. తినేతిండిలో నాణ్యత లోపించగా... కనీసం తాగేందుకు మంచినీరు అందుబాటులో లేని దుస్థితి. 450 మందికి 7 మాత్రమే స్నానాల గదులు ఉండగా... 13 మరుగుదొడ్లున్నాయి. విధిలేని పరిస్థితిలో బహిర్భూమికి బయటికి వెళ్లాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో ఉండాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
సంబంధిత కథనం..