AP Cabinet Meeting: ఏపీ మంత్రిమండలి ఏప్రిల్ 7న సమావేశం కానుంది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇదే ప్రస్తుత మంత్రిమండలి చివరి భేటీ కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగేవారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి 7న జరిగే సమావేశానికి ఎజెండా కోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వశాఖల అధిపతులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీనిపై నేడోరేపో అధికారిక వర్తమానాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపే అవకాశముంది.
ప్రస్తుత మంత్రిమండలిలోని మంత్రుల్లో తొలగించే వారితో వ్యక్తిగతంగా రాజీనామా చేయించి వాటన్నింటినీ కలిపి గవర్నర్‌కు పంపడం లేదా కేబినెట్ హెడ్‌గా తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులను మార్చుకుంటున్నానని వివరిస్తూ... వారి పేర్లతో కూడిన లేఖను గవర్నర్‌కు ముఖ్యమంత్రే అందించవచ్చు. వాటిని ఆమోదిస్తూ ఆయా ఖాళీలను గవర్నర్ నోటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆయా ఖాళీల్లో కొత్తగా నియమించుకోనున్న వారి పేర్ల జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్‌కు సమర్పిస్తారు. దాన్ని ఆమోదించి, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయాన్నివ్వాలని గవర్నర్‌ను కోరతారు.