ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో వైద్యబృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారుచేస్తున్న మందులను పరిశీలించింది. పర్యటనకు ముందే హైదరాబాద్ ల్యాబ్‌లో మందు నమూనాలను పరీక్ష చేయించింది. ఆ ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దాన్ని నాటుమందుగా గుర్తించామని ఆయుష్ శాఖ కమిషనర్ కర్నల్ రాములు తెలిపారు.
వంశపారంపర్యంగా మందులు ఇస్తుంటారని, ఆ క్రమంలోనే ఇది కూడా ఒక నాటు మందని పేర్కొన్నారు. ఈ మందులో హానికారక పదార్థాలు ఏమీ లేవని వెల్లడించారు. అయితే దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం తాము పరిగణించట్లేదని స్పష్టంచేశారు. ఈ మందు వినియోగం విషయంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్‌కు ఇక్కడి పరిస్థితులపై ఓ నివేదికను పంపనున్నట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడల్లోని ఆయుర్వేద వైద్యులు ఈ నివేదికను తయారు చేస్తారని పేర్కొన్నారు.