Staff Adjustment in Telangana Schools : విద్యాశాఖ ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు కొత్త మార్గాలు వెతుకుతోంది. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి కొన్ని హైస్కూళ్లలో పాఠాలు చెప్పిస్తున్న విద్యాశాఖ తాజాగా మరో ఆలోచన చేసింది. పనిభారం తక్కువున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు నిపుణులను సమీపంలోని అవసరమైన మరో పాఠశాలలో బోధించేలా చేయాలన్న ప్రణాళికతో ఉంది. అంటే ఉపాధ్యాయులు రెండు బడుల్లో పాఠాలు చెప్పాల్సి ఉంటుంది.
తక్కువ మంది ఉన్న వాటిపై దృష్టి..రాష్ట్రంలో 4,500 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిలో సుమారు 8.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటిలో ఐదు తరగతులకు కలిపి 50 మందిలోపు విద్యార్థులున్న హైస్కూళ్లు దాదాపు 350. వాటిని మరో పాఠశాలలో విలీనం చేద్దామంటే ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం బడులను మూసివేస్తోందని ప్రచారం జరిగితే సమస్య అవుతుంది. అందుకని వాటిని మూసివేయకుండా..టీచర్లను రెండుచోట్ల వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారులతో చర్చించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన వెల్లడించారు.
Staff Adjustment in Telangana Government Schools : కొన్ని హైస్కూళ్లలో ఎక్కువగా ఆరో తరగతిలో ఒక్క విద్యార్థీ ఉండరు.. అంటే ఆ తరగతికి పాఠాలు చెప్పనవసరం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రాంగణంలో రెండేసి హైస్కూళ్లు వేర్వేరుగా నడుస్తున్న పరిస్థితి 50చోట్ల ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి చోట్ల విలీనం చేసినా 400 మంది సబ్జెక్టు నిపుణులు మిగులుతారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో ఒకే ప్రాంగణంలో బాలికల హైస్కూలు, బాలుర ఉన్నత పాఠశాల నడుస్తున్నాయి. వాటిలో 100 మందిలోపే విద్యార్థులుండగా.. ఉపాధ్యాయులు 14మంది పనిచేస్తున్నారు. ఆ రెండింటిని ఏకంచేస్తే ఏడుగురు ఉపాధ్యాయులు మిగులుతారు. అలాంటి టీచర్లను ప్రస్తుతానికి పనిభారం లేనిచోట నుంచి, సమీపంలో మరో పాఠశాలకు వెళ్లి బోధించేలా చేయాలన్నది విద్యాశాఖ ఆలోచన.
అయినా.. కొరత తీరేనా..ఇప్పటికే 4 వేలకుపైగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. వారిలో కొన్ని వందల మందిని హైస్కూళ్లకు పంపించారు. అయినా ఉన్నత పాఠశాలల్లోనే ఇంకా కనీసం 5వేల మంది అవసరం. ఇప్పుడు విద్యాశాఖ కొత్త ప్రతిపాదన అమలైనా కొంత వరకే కొరతను తీర్చగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఎంలుగా 2వేల మంది స్కూల్ అసిస్టెంట్లు పనిచేస్తుండటం గమనార్హం.