తెలంగాణ

telangana

ETV Bharat / city

పదిలో 90 శాతం ఉత్తీర్ణత.. మళ్లీ బాలికలదే పైచేయి

SSC Results
SSC Results

By

Published : Jun 30, 2022, 11:34 AM IST

Updated : Jul 1, 2022, 3:37 AM IST

11:32 June 30

ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

SSC Results 2022 : కరోనాతో రెండేళ్లు చదువు ఆగమాగమైనా పదో తరగతి ఫలితాల్లో మాత్రం 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల ఉత్తీర్ణత శాతాన్ని పక్కనపెడితే 2019లో అత్యధికంగా 92.43 శాతం మంది పాసయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయి ఉత్తీర్ణత అదేకాగా... ఈసారి సాధించిన ఫలితాలు రెండో అత్యధికం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని 11,402 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా...అందులో 3,007 బడుల్లో అందరూ పాసయ్యారని, 15 విద్యా సంస్థల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలు 99.32 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని పొందాయన్నారు. విజేతలను అభినందించిన మంత్రి... తప్పిన వారు ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలయ్యే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించాలని సూచించారు. టీచర్లు వారానికి ఒకటీ రెండు గంటలు ఆ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకునేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా అందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ జిల్లా టెన్త్‌ ఫలితాల్లో ఏటా చివరి స్థానంలో ఎందుకు ఉంటుందో పోస్టుమార్టమ్‌ చేస్తామని తెలిపారు. ఇంటర్‌ లేదా పదో తరగతిలో కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు ఎందుకు వస్తున్నాయో పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు పాల్గొన్నారు.

23 జిల్లాల్లో 90 శాతం దాటిన ఉత్తీర్ణత

ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం, ఆపైన ఉత్తీర్ణత సాధించిన జిల్లాలే 23 ఉండటం విశేషం. అందులో 95 శాతానికిపైగా ఉత్తీర్ణులు ఉన్న జిల్లాలు తొమ్మిది ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏకంగా 97.85 శాతం మంది పాసయ్యారు. 2017, 2018, 2019 సంవత్సరాలలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్‌ కొట్టింది. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా అందరూ పాసయ్యారు. ఈసారి ఆ జిల్లా 21వ స్థానానికి పడిపోయింది.

పరీక్ష రుసుం జులై 20లోపు చెల్లించాలి

తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు జులై 20లోపు పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు రెండు రోజుల వరకు చెల్లించవచ్చు. మార్కుల పునఃలెక్కింపు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 జులై 15లోపు ఎస్‌బీఐ బ్యాంకు చలానా ద్వారా చెల్లించాలి. పునఃపరిశీలన, జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులతో ధ్రువీకరణ చేయించి ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించాలి. గ్రేడ్‌ మారితేనే సవరించిన ధ్రువపత్రాలను జారీ చేస్తారు.

10 జీపీఏ... లక్షల నుంచి వేలల్లోకి...

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల్లో 10కి 10 గ్రేడ్‌ పాయింట్లు దక్కించుకున్న వారి సంఖ్య గత రెండు సంవత్సరాలు భారీగా ఉండగా... ఈసారి మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లో ‘ఏ1’ మార్కులు(90 శాతం, ఆపైన) పొందిన వారికే 10 జీపీఏ వస్తుంది. కరోనా కారణంగా 2020, 2021లలో పరీక్షలు జరగలేదు. దాంతో ఫార్మేటివ్‌, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఫలితంగా 2020లో 1.41 లక్షల మంది, 2021లో 2.10 లక్షల మందికి 10 క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(సీజీపీఏ) దక్కింది. ఈసారి పరీక్షలు జరగడంతో ఆ సంఖ్య 2019 నాటి కంటే పెరిగినా 11,343తో ఆగిపోయింది. తాజాగా పాసైన విద్యార్థులు 8వ తరగతి పరీక్షలు రాయలేదు. 9వ తరగతిలో నెలన్నర మాత్రమే తరగతులు జరిగాయి. పదో తరగతిలో కూడా సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.

83.60 శాతం ప్రైవేట్‌లోనే

ఈసారి ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిన 9,484 మందికి 10కి 10 గ్రేడ్‌ వచ్చింది. అంటే 83.60 శాతంతో సమానం. ఇక మిగిలిన 16 శాతాన్ని ఎయిడెడ్‌, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, సంక్షేమ పాఠశాలలు తదితర 11 రకాల విద్యాసంస్థలు పంచుకున్నాయి.

ఎస్సీ గురుకులాల్లో 98.14శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. అన్ని గురుకుల సొసైటీల విద్యార్థులు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ విద్యార్థుల్ని అభినందించారు.

* సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు 98.14శాతం మంది పాసయ్యారు. 18,545 మందికి 18,200 మంది ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ చరిత్రలో తొలిసారిగా 126 పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించాయి. 287 మంది 10జీపీఏ పొందారు.

* మహాత్మ జ్యోతిబాఫులె తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 గురుకుల పాఠశాలల్లో 77 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం 10,645 మందికి గాను 10,381 మంది పాసయ్యారు. 467 మంది 10 జీపీఏ సాధించారు.

* గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 96శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,287 మందికి 6,557 మంది పాసయ్యారు. 20 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 44 మంది 10 జీపీఏ సాధించారు.

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 96శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,287 మందికి 6,557 మంది పాసయ్యారు. 20 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 44 మంది 10 జీపీఏ సాధించారు.

పరీక్షల కంటే ప్రాణం ముఖ్యం.. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడటం వంటి పనులు చేయొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. పరీక్షలు, ఫలితాలు, పాస్, ఫెయిల్ కంటే జీవితం ముఖ్యమని తెలిపారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చొద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు ఈసారి మరి కాస్త శ్రద్ధ పెట్టి చదివి పాస్ అవ్వాలని సూచించారు.

Last Updated : Jul 1, 2022, 3:37 AM IST

ABOUT THE AUTHOR

...view details