పరీక్షలు లేకుండా పదో తరగతి మార్కులు లేదా గ్రేడ్లతో ఎంత వరకు ఉపయోగం ఉందన్న ప్రశ్న అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఉన్నందున వాటిని విద్యార్థులు పరిగణనలోకి తీసుకుంటారు. మరి పదో తరగతి మార్కులకు అంత డిమాండ్ ఉందా అన్నది ప్రశ్న.
పది గ్రేడ్ల ఆధారంగానే నేరుగా బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు 10 జీపీఏ ఉన్న వారికి ఇంటర్ ప్రవేశాల సందర్భంలో రాయితీలిస్తుంటాయి. పదో తరగతి విద్యార్హత ఆధారంగానే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ రాయడానికి అర్హులు.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు
10 జీపీఏ సాధించిన విద్యార్థులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్(ఇంటర్, బీటెక్ కలిపి) కోర్సును అందించే బాసరలోని ఆర్‌జీయూకేటీలో ప్రవేశం లభించడమే. పది పరీక్షల్లో వచ్చిన గ్రేడ్లను బట్టే అక్కడ 1500 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. అందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారందరూ పోటీపడవచ్చు. రెసిడెన్షియల్ కాకుండా సాధారణ సర్కారు బడుల్లో చదివిన వారికి వచ్చిన గ్రేడ్‌కు 0.40 గ్రేడ్‌ను అదనంగా కలిపి పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలిస్తారు. అంటే సాధారణ జడ్పీ, ప్రభుత్వ బడుల్లో చదివి 10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థి గ్రేడు 10.40గా పరిగణిస్తారు.