PAPER LEAK: ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. పరీక్షలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే.. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు బయటకొస్తున్నాయి. కొవిడ్ వల్ల ఇప్పటికే విద్యార్థుల విలువైన సమయం వృథాగా పోయింది. తాజాగా ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వార్తలపై విచారణ జరుపుతున్న అధికారులు.. చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతున్నా.. లీకేజీ పరంపర ఆగడం లేదు. తాజాగా ఆంగ్లం ప్రశ్నపత్రం లీకేజీపై చర్యలు తీసుకున్నారు.
శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. నల్లచెరువు ఉన్నత పాఠశాల హెచ్‌ఎంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లచెరువు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల గాండ్లపెంట చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న విజయకుమార్.. గాండ్లపెంట నుంచి ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని వాట్సప్‌లోకి పంపినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.
లీక్‌ల పరంపర:రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల నిర్వహణపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. 27, 28 తేదీల్లో తెలుగు, హిందీ పేపర్లు ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించబోమని అధికార యంత్రాంగం ప్రకటించింది. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంగ్ల పరీక్ష మొదలైన 8 నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే.. ఇలాంటి పరీక్షలు ఎందుకు నిర్వహించడమని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.