రాష్ట్ర విద్యుత్ రంగానికి జలవిద్యుత్ ఆయువుపట్టు కాగా...ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో శ్రీశైలం ప్రాజెక్టుదే ప్రధాన పాత్ర. అత్యంత చౌకగా విద్యుత్‌ను అందిస్తున్న జలవిద్యుత్కేంద్రాలు ఏటా రూ.వందల కోట్లు ఆదా చేస్తూ ఎంతో ఆదుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.6 కు పైగా వెచ్చిస్తే తప్ప కొనలేని పరిస్థితుల్లో ఈ కేంద్రాల నుంచి సగటున రూ.3.56కే లభిస్తోంది.
* రాష్ట్రంలో 11 చోట్ల ఉన్న జలవిద్యుత్కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2441.80 మెగావాట్లు. ఇందులో శ్రీశైలం 900, నాగార్జునసాగర్ 815.60 మెగావాట్లతో 70.25 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. 11 జలవిద్యుత్కేంద్రాలున్నా విద్యుదుత్పత్తి అధికంగా జరిగేది శ్రీశైలంలోనే. ఉదాహరణకు గతేడాది (2019-20) మొత్తం 4509.20 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ ఉత్పత్తికాగా శ్రీశైలం నుంచి వచ్చిందే 1993.10 ఎంయూ (44.20 శాతం) ఉండటం గమనార్హం.
* రాష్ట్ర జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో శ్రీశైలం కేంద్రం వాటా 36 శాతమే అయినా ఉత్పత్తిలో ఏటా అంతకుమించి ఉంటోంది. ఇక ఈ ఏడాది (2020-21)లో ఈ నెల 20 వరకూ రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్కేంద్రాల నుంచి 428 ఎంయూల ఉత్పత్తి కాగా ఇందులో శ్రీశైలం నుంచి వచ్చిన కరెంటే 277.3 ఎంయూలు.