తెలంగాణ

telangana

ETV Bharat / city

పద్మావతి పల్లెకెళ్లింది! - పద్మావతి పల్లెకెళ్లింది!

లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చేశారు. ఊహించని సెలవులను తోచినట్టుగా గడిపేస్తున్నారు విద్యార్థులు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆమె నిర్దేశించిన కర్తవ్యం ఏమిటి? విద్యార్థులు ఆచరిస్తున్న విధానం ఎట్టిది? చదివేయండి మరి..

SRI PADMAVARHI MAHILA VISHWA VIDYALAYAM
పద్మావతి పల్లెకెళ్లింది!

By

Published : Apr 26, 2020, 8:30 PM IST

లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకూ సెలవులు ఇచ్చేశారు. అందరూ వాళ్ల వాళ్ల ఊళ్లకు వెళ్లిపోయారు. ఇంట్లోనే ఉంటున్నారు. పాఠాలేవో చదువుకుంటున్నారు. అసైన్‌మెంట్లు ఏవో చేసుకుంటున్నారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందులో విద్యార్థులను భాగం చేశారు వర్సిటీ ఉపకులపతి జమున. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ వేదికగా.. విద్యార్థినులే ఆయుధాలుగా.. విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్ష కుటుంబాలకు అవగాహన కల్పించే లక్ష్యంతో విద్యార్థులను రంగంలోకి దించారు. ఉన్న ఊళ్లోనే, ఇంటి పరిసరాల్లోనే తమవంతుగా కృషి చేయాలని సూచించారు. ఒక్కో విద్యార్థిని 20 కుటుంబాలకు కరోనా గురించి తెలియజేసేలా ప్రణాళికలు రూపొందించారు.

చైతన్యం కల్పిస్తూ..

కరోనా మహమ్మారిపై భయాందోళనలు తొలగించడం కొందరి బాధ్యత. రోగనిరోధకశక్తిని ఎలా పెంచుకోవాలో సూచించే పని ఇంకొందరిది. ఇలా విద్యార్థుల సాయంతో కొవిడ్‌-19పై పోరాటం మొదలుపెట్టారు జమున. విద్యార్థులే కాకుండా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. వర్సిటీకి చెందిన దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఇతోధికంగా పాటుపడుతున్నారు.

ఎవరికి వారు..

యోగా సర్టిఫికేట్‌ చేస్తున్న కొందరు తమ గ్రామాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలతో యోగాసనాలు వేయిస్తున్నారు. ధ్యానం, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెబుతున్నారు నర్సింగ్‌ విద్యార్థినులు. న్యూట్రిషన్‌ కోర్సు విద్యార్థినులు పప్పు దినుసులు, ఆకుకూరలు, కాయగూరల ప్రాధాన్యం వివరిస్తున్నారు. పోషక విలువలున్న ఆహార పదార్థాలు ఎలా చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు నచ్చేలా విభిన్న వంటకాలు ఎలా వండాలో చెబుతున్నారు. ఇలా వేలమంది విద్యార్థులను నడిపిస్తూ.. కరోనా వ్యాప్తిని అడ్డుకునే మహాక్రతువును కొనసాగిస్తున్నారు ఆచార్య జమున. విద్యార్థులు తగు రక్షణ చర్యలు పాటిస్తూ.. ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుంటున్నారు.

కుంగిపోతే ఫోన్‌ చేయండి..

లాక్‌డౌన్‌ వేళ ఇళ్లకే పరిమితం కావడంతో కొందరు విపరీతంగా ఆలోచిస్తున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు. వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చే ఏర్పాటు చేశారు జమున. ‘ఈ విపత్కర సమయంలో మనోబలం చాలా అవసరం. కరోనాపై తీవ్రంగా ఆలోచిస్తూ మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సూచనలు ఇవ్వడానికి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేశామ’ని చెప్పుకొచ్చారు వీసీ ఆచార్య జమున. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్ప్‌ సైకాలజిస్ట్స్‌ కలిసి కొవిడ్‌-19 కౌన్సెలింగ్‌ సపోర్ట్‌ సర్వీస్‌ను ప్రారంభించారు. వీసీ ఉపాధ్యక్షులుగా, ఈ బృందంలో 26 మంది సైకాలజిస్టులు సభ్యులుగా ఉన్నారు. కరోనాపై ఎలాంటి సందేహాలు, ఆందోళనలు ఉన్నా.. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-48214822కు ఫోన్‌ చేయొచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంటుంది.

ఇవీ చూడండి:తెరాస ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగానే : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details