అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందని భారత వైమానికదళంలో ఉన్నతాధికారిగా పనిచేసిన స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ అభిప్రాయపడ్డారు. తాలిబన్ల తిరుగుబాటు, తదనంతర పరిస్థితులపై ‘ఈనాడు, ఈటీవీ’తో మాట్లాడిన ఆయన భారత్‌తోపాటు ప్రజాస్వామ్య దేశాలైన ఇజ్రాయెల్, అమెరికాలే వారికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాలిబన్లను కొన్ని దేశాలు పెంచి పోషించాయని.. భౌగోళికంగా పక్కనే ఉన్న భారత్‌పై శత్రు దేశాలతో కలిసి దాడికి యత్నించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సుమారు పదికిపైగా తీవ్రవాద సంస్థలను పోషిస్తున్న పాకిస్థాన్‌తో ఒకవైపు ఇబ్బంది అయితే.. ప్రస్తుతం తాలిబన్ ఆక్రమిత అఫ్గానిస్థాన్ మరో సమస్యగా మారే అవకాశం ఉందని తెలిపారు.
తాలిబన్లు ఇదేవిధంగా చెలరేగితే మూడో ప్రపంచయుద్ధ పరిస్థితులు వచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. అఫ్గానిస్థాన్‌కు చైనాతోపాటు పాకిస్థాన్ సహాయం చేసి భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతాయన్నారు. అఫ్గాన్‌కు మరోపక్క ఉన్న పాకిస్థాన్, అక్కడున్న ఉగ్రవాద సంస్థలపై తాలిబన్లు ఆధిపత్యం చెలాయిస్తే భారత్‌కు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని కాళిదాస్ తెలిపారు. తాలిబన్లు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు తీవ్ర కలవరపెడుతున్నాయని చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ మిత్రదేశాలతో కలిసి కార్యాచరణపై కసరత్తు చేయాల్సి ఉంటుందని కాళిదాస్ అభిప్రాయపడ్డారు.