ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం(Tirupati Floods) చిన్నపాటి వర్షానికే నీట మునుగుతోంది. తిరుమలకు వెళ్లే దారులన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటమునిగి నగరవాసులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడి రహదారుల పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
తిరుపతిలోని రైల్వే అండర్ బ్రిడ్జి(Tirupati railway under bridge) కింద వరద నీటిలో వాహనం మునిగి శ్రీవారి భక్తురాలు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరం చిన్నపాటి వర్షానికే నీట మునిగి పోతోంది. కొండలపై నుంచి వస్తున్న వరద నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే తిరుపతి ప్రజల్లో భయం నెలకొంటోంది. నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు తప్ప.. శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని రహదారులు, వీధులతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటమునిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే వేల మంది భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు నగరంలో రెండు రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించగా.. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నిర్మించిన రైల్వేఅండర్ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే నీట మునుగుతోంది.
తిరుపతికి ఎగువన దాదాపు 15 కిలోమీటర్ల ప్రాంతంలో కురిసే వర్షపు నీరంతా అంతర్గత కాల్వల ద్వారా నగరం వెలుపలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రధాన కాలువలతో పాటు నాలాలు ఆక్రమణలకు గురవడంతో వర్షపునీరు వీధుల్లోకి చేరుతోంది. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం., నిర్వహణా వైఫల్యంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ప్రవహించే కాలువల్లో సరిగా పూడిక తీయకపోవడం, రైల్వే అండర్‌బ్రిడ్జిల ప్రాంతాల్లో నాలాలు పూడిపోవడంతో ప్రమాదంగా మారుతున్నాయి.
"తిరుపతి నగరం అస్తవ్యస్తంగా మారింది. వర్షం వస్తే రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. స్మార్ట్ సిటీ పేరుకు మాత్రమే.. కానీ ఆచరణలో మాత్రం ఆ దాఖలాలు లేవు."