తెలంగాణ

telangana

ETV Bharat / city

నిల్వ మంత్రం నేర్పించి... కాసులవర్షం కురిపిస్తోంది... - nidhi pant s4s technologies latest news

పంటకి గిరాకీ లేనిరోజుల్లో... రైతు కష్టమంతా నేలపాలే! రైతన్నకి అది కోలుకోలేని దెబ్బ అవుతుంది...ఈ పరిస్థితి రాకుండా ఆ పంటను నిల్వ ఉంచుకునే సోలార్‌ డ్రయర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చింది నిధీపంత్‌. భారతీయరైల్వేతో సహా 700 సంస్థలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆహార వృథాని అరికడుతున్నాయి. దాని ఫలితంగానే ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో చోటు సంపాదించింది నిధీపంత్‌.

NIDHI PANT
NIDHI PANT

By

Published : Aug 8, 2020, 8:04 AM IST

మార్పు కోసం ప్రయత్నించని చదువులు... సమాజానికి ఉపయోగపడని పరిజ్ఞానం వృథా అని నొక్కి చెబుతుంది నిధీ పంత్‌. ముంబయిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ పూర్తిచేసింది నిధి. హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్నపల్లెటూరు ఆమెది. నిధి తల్లిదండ్రులు ఇద్దరూ శాస్త్రవేత్తలు. వారు గ్రామాలకు, పట్టణాలకు మధ్య చక్కటి సంబంధం ఉండాలనీ, అది సాంకేతిక ద్వారా సాధ్యమని నిధికి తరచుగా చెప్పేవారు. దాంతో ఊరికి వెళ్లినప్పుడల్లా వ్యవసాయం గురించి తెలుసుకునేది.

అయ్యే పనేనా అన్నారు...

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట తాలూకు లాభాన్ని అందుకోలేకపోతున్నారని గమనించింది. కారణాలు వెతికితే మద్ధతు ధర రాకపోవడం, ప్రకృతి ప్రకోపాలు... ఇలా చాలానే ఉన్నాయి. వీటి నుంచి పంటను రక్షించుకుని భద్రపరుచుకునే విధానం లేదు. దాని ఫలితమే రైతు ఆత్మహత్యలని అర్థం చేసుకుంది. ఈ విషయమే ఓ రోజు కాలేజీలో స్నేహితుల మధ్య చర్చకు వచ్చింది. ఊర్లో కొన్ని ఇళ్లముందు మామిడికాయలు, ఎండుమిర్చి వంటివి ఆరు బయట ఎండబెట్టడం కనిపించింది. ఆ సంప్రదాయ విధానమే నిధి మనసులో సోలార్‌ డ్రయర్ల రూపకల్పనకు పునాది పడేలా చేసింది. నిధి బృందం రైతులని కలిసి మాట్లాడినప్పుడు ఇవన్నీ అయ్యే పనేనా అంటూ తేలిగ్గా తీసిపారేశారు.

పట్టుదలతో సాధించింది...

నిధి స్నేహబృందం వెనకడుగు వేయలేదు. చాలా వైఫల్యాల తరువాత విద్యుత్‌ వినియోగం లేకుండా సూర్యరశ్మిని వాడుకునేలా డ్రయర్లను తయారుచేసింది. ఈ డ్రయర్లు వ్యవసాయ ఉత్పత్తుల్లో తేమను తగ్గించి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి. ఫలితంగా రైతులు రసాయనాలు వినియోగించకుండానే ఏడాది పాటు వీటిని భద్రపరుచుకోవచ్చు. గిట్టుబాటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. దీనివల్ల ఆహారం వ్యర్థం కాదు... రైతు నష్టాల బారిన పడకుండా ఉంటాడు. ఉల్లి, బొప్పాయి, అరటి...ఇలా ఏ ఉత్పత్తినైనా సరే తొంభైశాతం నీటిని తొలగించి నిల్వ ఉండేలా చేస్తుంది. పోషకాలను కోల్పోయే సమస్యా ఉండదు. ఈ ఉత్పత్తులను దేశీవిదేశీ పేరుతో అమ్మకాలు సాగించడం ద్వారా రైతులకు కొత్త దారిని చూపించింది. ఈ ఆలోచన ఐక్యరాజ్యసమితి ప్రశంసలూ దక్కించుకుంది. పేద మహిళలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ, మార్కెటింగ్‌లో సాయం అందిస్తూ వారిని ఔత్సాహిక వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దింది నిధి.

నూతన ఆవిష్కరణలు..

అక్కడితో తమ పని పూర్తి అయిపోయింది అనుకోలేదు నిధి. ఎస్‌4ఎస్‌ పేరుతో మరో స్టార్టప్‌ని స్నేహితులతో కలిసి ప్రారంభించింది. ఇందులో భాగంగా వీరు ప్రారంభించిన సాంకేతిక ఆవిష్కరణే హల్దీ టెక్‌. అంతర్జాతీయంగా పేటెంట్‌ పొందిన దీని ద్వారా అల్లం, పసుపు వంటి అన్ని గడ్డ దినుసులనీ డీహైడ్రేట్‌ చేయవచ్చు. నిధీపంత్‌ 2019 సంవత్సరానికి గాను ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డునీ అందుకుంది. అదే ఏడాది ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ జాబితాలో 30అండర్‌30 ఆసియాలో పేరు సంపాదించుకుంది. సొడెక్సో, ఇండియన్‌ రైల్వే, క్యాపిటల్‌ ఫుడ్స్‌, నెస్లే, యూనీలివర్‌ వంటి 700కు పైగా ఫుడ్‌ ఇండస్ట్రీలు ఈ సంస్థకు ఖాతాదారులుగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details