తెలంగాణ

telangana

ETV Bharat / city

హింసకు సంకెళ్లేద్దాం... 'ఆమె'ను స్వేచ్ఛగా ఎగరనిద్దాం!

మహిళలకు స్వేచ్ఛపెరిగింది... వారి కీర్తి నింగికెగిసిపోతోంది... ఉన్నత అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. గాజు తెరలు బద్దలు కొట్టి దూసుకుపోతున్నారు...అంటూ ఎన్నో వింటున్నాం. అదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు అతివ ఎంత ఎత్తుకి ఎదిగినా.... వివక్ష, అసహనం అన్నిచోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. మగవారికి దీటుగా పోటీ ప్రపంచంలో నిలబడుతున్నా... ఎక్కడో ఒక చోట నిత్యం హింసకు గురవుతూనే ఉంది. అసలు ఎందుకీ హింస...దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రపంచ స్త్రీ హింసా నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...

By

Published : Nov 25, 2019, 10:51 AM IST

Updated : Nov 25, 2019, 11:59 AM IST

special story on women

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్న ఆర్యోక్తిని గొప్పగా చెప్పుకుంటాం. కానీ దానికి భిన్నంగా మహిళలపై లైంగికదాడులు, దౌర్జన్యాలు వంటివి రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

హింస ఏ రూపంలో ఉన్నా...

హింస ఏ రూపంలో ఉన్నా...మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అంటోంది ఐక్యరాజ్యసమితి. ఈ సంస్థ అభిప్రాయం ప్రకారం... మహిళలపై హింస అంటే... భౌతిక, మానసిక, లైంగిక వేధింపులు, స్త్రీల వ్యక్తిగత, ప్రజా జీవితానికి భంగం కలిగించే ప్రవర్తన. వాటిల్లో లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు మొదలు...పెంపకంలో వ్యత్యాసం చూపించడం, అవకాశాల్లో అసమానతలు, బాల్యవివాహాలు, అక్రమ తరలింపు, బలవంతపు పెళ్లిళ్లు, వరకట్న వేధింపులు...ఇలా ఎన్నో ఉంటాయి.

ఐక్యరాజ్యసమితి నడుం బిగించింది...

దీంతో ఆరోగ్యపరంగా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, హెచ్‌ఐవీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంది. కుంగుబాటుకీ గురవ్వొచ్ఛు, ప్రాణాపాయమూ ఎక్కువే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్యసమితి నడుం బిగించింది. స్త్రీల భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఏటా నవంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసా నిరోధక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

బాధితులెవరు? కారణాలు ఏంటి?

మన చుట్టూ ఉన్న అక్క, చెల్లి, అమ్మ...ఇలా ప్రతి ఒక్కరూ బాధితులే. వీరి జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఆ బాధను అనుభవించిన వారే. నిరక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, ప్రేమ, పెళ్లి, ఉపాధి వంటివి ఈ హింస బారిన పడేలా చేస్తున్నాయి. పురుషాధిక్యత, మాధ్యమాలు, పోర్నోగ్రఫీ, మద్యపానం, మాదకద్రవ్యాలు, పేదరికం, ఆడపిల్లల నిస్సహాయత వంటివి వీరిపై హింసను ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్యలకు ఆర్థికపరమైన ఒత్తిళ్లు తోడవుతున్నాయి. అభివృద్ధి పరిమాణాలు, జీవనశైలిలో మార్పులు...మరికొంత ప్రభావం చూపుతున్నాయి.

పరిష్కారం ఎలా?

నిజానికి ఈ సమస్యల్ని కేవలం మహిళల సమస్యగా మాత్రమే అనుకోవద్ధు సామాజిక రుగ్మతగా భావించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనల్లో చాలావరకూ భాగస్వామి, తెలిసినవారే ఈ తరహా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ హింసబారి నుంచి మహిళలు బయటపడాలంటే... మార్పు సామాజికంగా జరగాలి. ఆ అడుగులు మొదట మన ఇంటి నుంచే మొదలవ్వాలి.

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆత్మరక్షణ విద్యలూ అలవర్చుకోవాలి. ప్రతి తల్లి ఆడపిల్లకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు అబ్బాయిల దృక్పథాల్లోనూ మార్పు తీసుకురావాలి. చదువు అందించే విజ్ఞానంతో పాటు సంస్కారం వారికి అలవడేలా చూడాలి. ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. అలాంటివాటిల్లో పూణెకి చెందిన ఈక్వల్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌ ఒకటి. టీనేజీ అబ్బాయిల ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా మహిళలపై హింసను అరికట్టాలనుకుంటోంది ఈ సంస్థ. యాక్షన్‌ ఫర్‌ ఈక్వాలిటీ పేరుతో వేలాది మంది మగపిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఇంట్లో తమ తల్లి, చెల్లితో గౌరవంగా ఎలా మాట్లాడాలి, ఇంటి పనుల్లో సాయం చేయాల్సిన అవసరం వంటివి చెబుతోంది. ఇక, మహిళలు వేధింపుల బారిన పడకుండా, బాధితులు త్వరగా బయటపడేలా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి. ప్రభుత్వం చట్టపరమైన రక్షణా కల్పిస్తోంది.

స్త్రీ సమస్యలపై పోరాడే స్వచ్ఛంద సంస్థల్లో కొన్ని ఇవి...

  1. బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, గృహహింస... బాధిత మహిళలకు సరైన పరిష్కారం చూపిస్తుంది తెలుగురాష్ట్రాలకు చెందిన భూమిక సంస్థ. (హెల్ప్‌లైన్‌ నంబర్‌ -18004252908)
  2. బాలికల అక్రమ రవాణా, విదేశీ పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిల తరలింపుల్ని సమర్థంగా అడ్డుకుంటోంది హైదరాబాద్‌కి చెందిన షాహీన్‌ సంస్థ. (04024386994)
  3. మానవ అక్రమ రవాణా, దాడులు, వ్యభిచారం వంటివాటికి బలైన ఆడపిల్లల సంరక్షణకోసం పనిచేస్తోంది హైదరాబాద్‌కి చెందిన ప్రజ్వల సంస్థ. బాధితులకు అన్నివేళలా సాయంగా ఉండే ఈ సంస్థ ఫోన్‌ నంబర్‌ - 8414237304

భాగస్వామి నుంచి శారీరక, మానసిక వేధింపులూ.. కట్నం కోసం అత్తింటివారు పెట్టే చిత్రహింసలు...సమస్య ఏదైనా మహిళలకు అండగా నిలబడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా శిశుసంక్షేమ విభాగాలు. ప్రతి జిల్లాలో ఉన్న ఆ సంస్థ కేంద్రాల్ని సంప్రదించి సాయం కోరవచ్చు.

చట్టం ఏం చెబుతోంది?

  • మహిళలపై హింసను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు కావాలి. వాటి అమలు పక్కాగా సాగాలి. అలాంటి వాటిల్లో గృహహింస చట్టం-2005 ఒకటి. ఇది వివాహ బంధంలో ఉండి హింసకు గురవుతున్న మహిళలకు వర్తిస్తుంది. అధిక కట్నం, పుట్టింటి ఆస్తిలో భాగం, విలాసాలకు డబ్బు తీసుకురావాలని అడగడం, వివాహేతర సంబంధాలతో చిత్రవధకు గురిచేయడం వంటివి నేరాలుగా పరిగణిస్తారు. నేర నిరూపణ అయితే ఒక సంవత్సరం జైలుశిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధిస్తారు.
  • రెండోది నేర సంబంధిత న్యాయసవరణ చట్టం -2013. ఆమ్లదాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటివన్నీ నేరాలుగా పరిగణిస్తారు. సెక్షన్‌ 354(ఏ) కింద లైంగిక హింస, దౌర్జన్యం, అశ్లీల చిత్రాల ప్రదర్శన... వంటివాటికి మూడు నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సెక్స్‌వర్కర్ల చట్టం, స్త్రీల అసభ్య చిత్ర నిషేధ చట్టం- 1986, మానవ అక్రమ రవాణా నియంత్రణ చట్టం... వంటివెన్నో మహిళలకు అండగా ఉన్నాయి.
Last Updated : Nov 25, 2019, 11:59 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details