టాలీవుడ్ డ్రగ్స్ కేసు (TOLLYWOOD DRUGS CASE)... తెరాస, కాంగ్రెస్ మధ్య రాజకీయ కాక రేపుతోంది. పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ విచారించగా.. ఇదే కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ (ED) రంగంలోకి దిగింది. కొద్దిరోజులుగా సినీ పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నందు, నవదీప్, రవితేజ, తనీశ్, ముమైత్ ఖాన్ తదితరులను విచారించింది. డ్రగ్స్ కేసులో (TOLLYWOOD DRUGS CASE) ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్యాంకు ఖాతాల లావాదేవీలపై సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, రానా విచారణకు హాజరుకావడంపై రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎక్సైజ్ శాఖ విచారణలో ఈ ఇద్దరి పేర్లను ఎవరు తప్పించారని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ విచారణ ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగితే.. ఈ ఇద్దరు అప్పట్లో ఎందుకు రాలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు తెరాస కాంగ్రెస్ మధ్య మటాల తూటాలు పేల్చాయి.
శశిథరూర్ పర్యటనతో ముదిరిన వివాదం
ఈ వివాదం కాస్తా ఇటీవల శశిథరూర్ పర్యటనతో (SHASHI THAROOR TOUR) మరింత ముదిరింది. కేటీఆర్ పనితీరుకు థరూర్ ప్రశంసలు గుప్పించడం.. మీడియా చిట్‌చాట్‌లో ఆయన్ని రేవంత్‌రెడ్డి నిందించడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ రంగంపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ పట్ల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR TWEET) చేశారు. ఇలాంటి వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని.. రాహుల్‌గాంధీ చర్యలు తీసుకోవాలని సూచించారు. శశిథరూర్ ట్వీట్‌ను (SHASHI THAROOR TWEET) జతచేస్తూ రేవంత్‌రెడ్డికి (REVANTH REDDY) చురకలంటించారు. చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల సంభాషణను కేటీఆర్ తన ట్వీట్‌కు జతచేశారు. ఈ వ్యవహారాన్ని ఖండించిన కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల పర్యవేక్షకుడు మాణికం ఠాగూర్.. (manickam tagore) చిట్‌చాట్‌లో పాత్రికేయులు ఆడియో రికార్డు పెట్టడాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. దానిపైనా చురకలంటించిన తెరాస.. 'ఆఫ్ ద రికార్డ్'లో అయినా పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ పట్ల అసభ్య పదజాలం వాడొచ్చా అని ఎదురుదాడి చేసింది.
పరీక్షలకు సిద్ధం.. రాహుల్ సిద్ధమా..?
చిట్‌చాట్ పేరుతో రేవంత్‌రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను మంత్రి కేటీఆర్ మూడ్రోజుల క్రితం అదే స్థాయిలో తిప్పికొట్టారు. దిల్లీ పార్టీలు సిల్లి రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన మంత్రి.. కాంగ్రెస్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందన్నారు. భవిష్యత్‌లో పీసీసీని అమ్ముకుంటారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్.. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్‌ని తిడితే ఉరుకునే ప్రసక్తేలేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని హెచ్చరించారు. తనపై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి.. అన్ని డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలకు సిద్దమని.. రాహుల్ గాంధీ సిద్దమా అని ప్రశ్నించారు.