తెలంగాణ

telangana

ETV Bharat / city

Undralla Taddi Special: మంచి భర్త రావాలా... అయితే ఈ నోము చేయాల్సిందే!! - Undralla Taddi Special story

భాద్రపదం- పేరులోనే తన స్వభావ స్వరూపాలను ఇముడ్చుకున్న మాసం. భద్రమైన జీవన విధానానికి మార్గ నిర్దేశి. వరాహ, వామన జయంతులు, రుషిపంచమి, వినాయక చవితితో పాటు ఉండ్రాళ్లతద్దె వంటి రుతు సంబంధ పండగలూ ఉన్నాయి. ఆడవాళ్లు ఎంతో ఉత్సాహంగా భక్తితో జరుపుకునే ఈ ఉండ్రాళ్లతద్ది పండుగ, భాద్రపద మాస ఔన్నత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, నైతిక భద్రతను అందించే తోవ చూపటమే కాదు, మనిషిలోని ఎనిమిది తత్వాలు స్థిరంగా ఉంచేలా అడుగులు వేయించగలదీ మోదకతృతీయ.

Undralla Taddi Special
Undralla Taddi Special: మంచి భర్త రావాలా... అయితే ఈ నోము చేయాల్సిందే!!

By

Published : Sep 23, 2021, 11:48 AM IST

లక్ష్మీః మేధాధరా పుష్టిః గౌరీ తుష్టిః ప్రభాధృతిః
ఏతాభిః పాహి తనూభిః అష్టాభిః మాం సరస్వతీ

ఈ శ్లోకాన్ని ఈ నోముకు అన్వయించుకుంటే... వర్షాలు ఆర్థిక పరిపుష్టికి, పూజాలంకారాలు మేధస్సుకు సృజనాశక్తికి, ఉపవాస దీక్ష క్షమాగుణానికి, ఉండ్రాళ్లు శారీరక పుష్టికి, ఆశీస్సులు వాక్పటిమకు, ఆటలు ఉన్నదానితో తృప్తిచెందటానికి, గోరింటాకు, పసుపు పారాణి వంటి అలంకారాలు కళాకాంతులకు, సామాజిక భాగస్వామ్యం ధైర్యస్థైర్యాలకు సంకేతాలని చెప్పుకోవచ్చు.

పరాశక్తిని ఎనిమిది రూపాల్లో పూజించటం వల్ల భద్రత చేకూరుతుంది. ఈ పండుగ చేసుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమే ఉంది. పురాణ కథలను అనుసరించి మేనక, హిమవంతుల గారాలపట్టి పార్వతీ దేవి. ఆమె శివుణ్ని భర్తగా ఆశించి ఘోరతపస్సు చేసింది. అతిసుకుమారి ఐన ఆమె, రాలి పడిన పండుటాకులను సైతం తినకుండా అపర్ణగా మారి శంకరుడి కోసం చూస్తోంది. అప్పుడు కపట బ్రహ్మచారిగా ఆమె ముందుకు వచ్చాడు ఆదిభిక్షువు. శివుణ్ని దూషించాడు. రాకుమార్తె పార్వతి ఉండటానికి ఇల్లు కూడా లేని శివుడు తగడన్నాడు. ఆ మాటల్ని కొట్టిపారేయడమే కాదు, దీటుగా జవాబిచ్చి తన పతి శివుడే అంది. తనను అంతగా ఇష్టపడి, నమ్మిన గౌరిని అక్కున చేర్చుకుని ఆమె ఆకాంక్ష తీర్చిన ఆ శుభవేళే భాద్రపద బహుళ తదియ.
పార్వతీ పరమేశ్వరులు వాక్కు, అర్థాల్లా కలిసిపోయి ఉంటారని, ఇద్దరూ ఒక్కటై సమస్త లోకానికి అర్ధనారీశ్వరులైన అంత మంచిరోజునే మోదక తృతీయగా జరుపుకుంటున్నాం. ఏటా భాద్రపద బహుళ తదియనాడు ఆడపిల్లలలు ఉండ్రాళ్ల తద్ది నోచుకుంటారు. నిజానికిది రెండురోజుల పండుగ.

ముందు రోజు

ఐదుగురు ముత్తయిదువులకు గోరింటాకు ముద్ద, పసుపు కుంకుమలు, నువ్వులనూనె, కుంకుడుకాయలు ఇచ్చి ‘తాంబూలం తీసుకోవటానికి మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తారు. ఆడపిల్లలు కుంకుడు కాయలతో తలంటుకుని సాంబ్రాణి ధూపం పట్టిస్తారు. దాంతో కురులు సువాసనలు చిందిస్తాయి. తర్వాత పెద్దలు గోంగూర పచ్చడితోనో ఆవకాయతోనో పెరుగన్నం తినిపిస్తారు. ఈ తతంగమంతా సూర్యోదయానికి ముందే అంటే ఉదయం ఆరు గంటల లోపే పూర్తవ్వాలి. అంతటితో ఆ రోజు పండగ పూర్తయినట్టే.

రెండో రోజు

ముందురోజు లాగానే ఆడపిల్లలు పొద్దుపొద్దున్నే లేచి మళ్లీ గోంగూర లేదా ఆవకాయతో పెరుగన్నం తిని, పచ్చికబయళ్లు లేదా చెట్ల నీడన చేరి ఆటలాడుతూ ఉల్లాసంగా గడుపుతారు. తద్ది నోమును ఆచరించే పెళ్లయిన ఆడవాళ్లు మాత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. చంద్రోదయ సమయంలో పీఠంపై పసుపు గణపతి, గౌరీదేవిని ప్రతిష్ఠించి షోడశోపచార విధిలో పూజాదికాలు నిర్వహిస్తారు. అమ్మవారికి బియ్యప్పిండి, పెసరపప్పుల మిశ్రమంతో ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్లను నైవేద్యంగా నివేదిస్తారు.

ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్లను వాయనంపై దక్షిణ తాంబూలాదులు ఉంచి ఐదుగురు ముత్తయిదువులకు వాయనాలను, ఐదు వరుసల తోరాలను ఇస్తారు. సామాన్యంగా పెళ్లయిన నాటి నుంచి ఐదేళ్ల వరకు ఇలా నోచుకుని ఉద్యాపన చేసుకుంటారు. ఉద్యాపనకు వచ్చిన ముత్తయిదువులకు పసుపు, కుంకుమ, చందనం, పూలు, పండ్లతో పాటు తమ శక్తి మేరకు చీర రవిక పెట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వివాహితలు అన్యోన్య దాంపత్యం కోసం, పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త లభించాలని ఈ నోము నోచుకుంటారు.

ఆరోగ్య రహస్యం

సూర్యుడ్ని కప్పేసేంత మబ్బు పట్టినప్పుడు ఆకలి మందగిస్తుంది. కానీ వర్ష రుతువులో శరీరానికి పుష్టికరమైన ఆహారం అవసరం. అందుకే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్లను సూచించారు. గోంగూర, ఆవకాయ పచ్చళ్లు, పెరుగన్నం శరీరంలో సమ శీతోష్ణస్థితిని కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ కాలంలో తేమతో వచ్చే కాలిగోళ్ల వ్యాధులకు గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుందని ఉండ్రాళ్ల తద్ది పండగలో గోరింటాకును తప్పనిసరి చేశారు మన పెద్దలు.

ఎందుకీ పండగ?!

ఒక రాజుకు చాలామంది భార్యలున్నా.. వాళ్లందరినీ కాదని చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువ ప్రేమ చూపేవాడు. ఒకసారి రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ల తద్దె నోచుకుంటున్నారని చిత్రాంగికి తెలిసింది. తాను కూడా ఆ నోము నోచుకోవాలని ఆశపడింది. అవసరమైన సామగ్రి తెచ్చిపెట్టమని రాజును కోరింది. పూజ నిష్ఠగా చేయాలనుకుంది. కటిక ఉపవాసముంది. కానీ చంద్రోదయ వేళ కావస్తున్నా, ఆ సామాను ఏది రాలేదు. దాంతో కంగారుపడిన వేశ్య, నిండు మనసుతో ఇంట్లో ఉన్న బియ్యప్పిండి పెసరపప్పుతో మోదకాలు చేసి గౌరీదేవికి భక్తిగా సమర్పించింది. ఇలా ఐదేళ్లు నోచుకున్న చిత్రాంగి ఉత్తమగతులను పొందింది. పూజకు భక్తిపూరితమైన మనసే ప్రధానం కానీ మరేదీ కాదన్నది ఒక సందేశమైతే, సరంజామా లేదని పూజ వదలకూడదన్నది మరో నీతి.

ఇదీ చూడండి: 'పండగల వేళ జాగ్రత్త- కరోనాపై అలసత్వం వద్దు'

ABOUT THE AUTHOR

...view details