వారి సేవకు గుర్తింపు లేదు.. త్యాగానికి గౌరవం లేదు.. పనికి విలువ లేదు.. అయినా అన్నింటినీ ఓర్చుకుంటారు. అమ్మలా ఊరిని శుభ్రపరుస్తారు. వైద్యుడిలా నగర ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. వారే రాత్రి వేళల్లో పనిచేసి.. తమ శ్రమను చీకట్లో దాచి ఛీత్కారాలను ఎదుర్కొనే పారిశుద్ధ్య కార్మికులు. కష్టపడి తమ కాళ్లపై తామే నిలబడుతున్నారు.
ఓ ఇంటిని శుభ్రం చేయాలంటేనే....ఆ ఇళ్లాలు ఎంతో వ్యయప్రయాసలకు ఓడ్చి పనిచేస్తోంది. అలాంటిది కోటి జనాభా నివసించే హైదరాబాద్ నగరాన్ని ప్రతి రోజు శుభ్రం చేయడమంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ నిద్రపోతున్న సమయంలో జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులు విధులకు హాజరై ఉదయం వరకు రోడ్లను ఊడ్చేస్తారు. ఉదయం నగర రోడ్లు చూడగానే అద్దంలా మెరుస్తాయి. దీవి వెనుక ఎందరో మహిళల కృషి దాగుంది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ వైద్య, పోలీసు సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఈ మహమ్మారితో పోరాడుతూ నిత్యం రోడ్ల మీదే విధులు నిర్వహించారు. ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించారు.
చెత్త తొలగింపు అనేది మామూలుగానే చాలా ఇబ్బందికరమైన పని. అలాంటిది కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పారిశుద్ధ్య నిర్వహణ అనేది అంత తేలికైన పనికాదు. ఇలాంటి కీలక తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించారు. నిత్యం రోడ్లను ఊడుస్తూ, ఇళ్ల నుంచి చెత్తను తరలిస్తూ, రసాయనాలను చల్లుతూ శుభ్రంగా ఉంచారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు జంకే సమయంలో ఆస్పత్రిలోని చెత్తను కూడా తరలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం పనిచేశారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు ధైర్యంగా పనిచేశారు. భాగ్యనగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సుమారు 20 వేలకు పైగా మహిళా పారిశుద్ద్య కార్మికులు కష్టపడ్డారు.