గతేడాది రాజేంద్రనగర్ పల్లె చెరువు వరదంతా గుర్రం చెరువుకు చేరుకోవడంతో.. తటాకానికి అధికారులు గండి కొట్టారు. నీరంతా అల్‌జుబైల్ కాలనీ, గాజిమిల్లత్ కాలనీ, ఇమ్రాకాలనీ, ఉప్పుగూడ, శివాజీనగర్, క్రాంతినగర్, అరుంధతి కాలనీ, సైఫాబాద్, ఉస్మాన్‌నగర్, హఫీజ్‌బాబానగర్ ప్రాంతాలను ముంచెత్తింది. స్థానికంగా నాలా ఆక్రమణలు తొలగిస్తే ఈ సమస్య ఉత్పన్నంకాదు. అధికారులు రాజకీయ కారణాలతో ఆ పనులు చేపట్టడం లేదు.
పరిష్కరించలేక చెరువుకు ఉరి..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ వరద నీరు శాతన్ చెరువుకు చేరుతుంది. దీని వెనుక వైపు నదీం కాలనీ, నీరజ కాలనీలు ఏర్పడ్డాయి. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు వచ్చాయి. దీంతో చిన్నపాటి వర్షానికే నదీం కాలనీ, దాని చుట్టు పక్కల ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. 20ఏళ్లుగా ఇదే దైన్యం.
ముంచుతున్న మురుగు లైన్లు..
చిన్నపాటి వర్షానికే బేగంపేట బ్రాహ్మణవాడి, ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్, మయూరిమార్గ్ ప్రాంతాలు నీట మునుగుతాయి. అక్కడున్న మురుగునీటి పైపులైను వ్యవస్థే.. దిగువకు వెళ్లే వరదను కాలనీల్లోకి మళ్లిస్తోంది.