Amaravati Movement : రెండున్నరేళ్ల కాలపరీక్షలో.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైన అమరావతి రైతుల ఆనందోత్సాహమిది..! మూడు ముక్కలాట మొదలైనప్పటి నుంచీ పండుగలు, పబ్బాలకూ దూరంగా ఉన్న రైతు కుటుంబాలకు ఇదే అసలు సిసలు పండుగ.! ఉద్యమ శిబిరాల్లోనూ.. అదే ఉద్వేగం, ఉత్సాహం కనిపించింది. ఇలాంటి క్షణాల కోసమే అమరావతి రైతులు, మహిళలు రోజులు లెక్కపెట్టుకున్నారు. తాతలు, తండ్రులు ఇచ్చిన భూములను రాజధానికి రాసిచ్చిన.. అమరావతి రైతులు.. తమ త్యాగం వృథా కావడానికి వీల్లేదంటూ.. ఉద్యమంలోకి దిగారు. వైకాపా మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా కదంతొక్కారు. ఒకే మాటగా.. ఒకటే బాటగా.. ముందుకుసాగారు.
దేనికీ వెరవేలేదు. కేసులకు భయపడలేదు..
Amaravati Farmers : ఒకటా.. రెండా.. ఏకంగా 800 రోజులకుపైబడిన చరిత్ర అమరావతి ఉద్యమానిది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో.. దేనికీ వెరవేలేదు. కేసులకు భయపడలేదు.! పోలీస్ లాఠీలకు ఎదురొడ్డారు. అవమానాలు, అవహేళనలను తట్టుకున్నారు.! ప్రభుత్వం అణచివేతలకు.. ఎదురుతిరిగారు. బూతులు తిడితే భరించారు. శ్మశానం, ఎడారి అంటూ రెచ్చగొట్టినా ఓర్పుగా ఉన్నారు. సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లే ప్రతీసారీ పోలీసులు వలలు అడ్డుపెట్టి.. ఇళ్ల ముందు ఇనుప కంచెలు వేసినా.. వాటిని దాటుతూనే..ఉద్యమాన్ని ఒక్కో మెట్టూ ఎక్కించారు. అసెంబ్లీ ముట్టడి, జాతీయరహదారి దిగ్బంధం, దుర్గమ్మకు పొంగళ్లు.. కాగడాల ప్రదర్శనలు.. ఇలా అమరావతి ఉద్యమ బాణాన్ని ఒక్కోరూపంలో.. గురిపెట్టారు. కానీ ఏనాడూ లక్ష్యాన్ని విస్మరించలేదు. గోడకు కొట్టిన బంతిలా.. ప్రభుత్వ వేధింపులను భరిస్తూ.. అణచివేతలను సహిస్తూ.. మరింత బలంగా ఉద్యమించారు.
33 గ్రామాల గొంతుకల్ని ఏకతాటిపై..
Amaravati Farmers Protest : 33 గ్రామాల గొంతుకల్ని ఏకతాటిపై వినిపించిన ఉద్యమ చరిత్ర అమరావతిది. ఉద్యమాన్ని పార్టీలకు, కులాలకు అంటగట్టే ప్రయత్నం చేసినా.. ఆ విమర్శల మరక అంటకుండా.. ఒకే రాష‌్ట్రం ఒకే రాజధాని అనే పట్టాలపైనే ఉద్యమ బండి ఠీవీగా ముందుకు నడిచింది. రాజకీయఅభిమానాన్ని ఒక్క రైతు కూడా గడప దాటనివ్వలేదు. లోలోపల ఏ పార్టీపై అభిమానం ఉన్నా.. ఉద్యమ శిబిరంలో మాత్రం ఎక్కడా పొరపచ్చాల్లేకుండా.. చూసుకున్నారు. రైతు స్ఫూర్తిని చాటే ఆకుపచ్చజెండా కిందే పోరాటం సాగించారు. పార్టీల జెండాలు తాము మోయకుండా.. కలిసొచ్చే రాజకీయ పార్టీలూ అమరావతి అజెండాకు జైకొట్టేలా పోరాడారు. అందుకే ఇన్నిరోజులైనా ఉద్యమ నాయకుల మధ్యగానీ, రైతుల మధ్యగానీ, మహిళల మధ్యగానీ.. విభేదాలు అన్న మాటేలేదు. అమరావతి మీది, మాది, మనందరిదీ అన్న స్ఫూర్తే.. వారిని ఏకతాటిపై నడిపించింది.