Department of forest news: మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం, పెండింగ్లో ఉన్న పనులపై... సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, గిరిజన సంక్షేమ, అటవీశాఖ ఉన్నతాధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆ గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం నెల రోజుల్లో కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివాసీ, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శాంతికుమారి అన్నారు. మొత్తం మూడు వేలకు పైగా గుర్తించిన గ్రామాలకు ఇప్పటికే త్రీఫేజ్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మిగిలిన 239 గ్రామాలకూ నెల రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్ 46, కుమురం భీం ఆసిఫాబాద్ 98, మంచిర్యాల 26, నిర్మల్ 42, భద్రాద్రి కొత్తగూడెంలో 27 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఇంకా అందించాల్సి ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.