AP CM JAGAN ON RAINS: భారీ వర్షాలపై చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలో వరదనీటి నిల్వకు కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్...ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని శుక్రవారం జరిగిన కాన్ఫరెన్స్‌లో సీఎం స్పష్టం చేశారు.
పంటనష్టం అంచనా వేయాలి..
Rs.5 lakh compensation: ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా భక్తులను కొండపైనే ఉంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తిరుమల భక్తులకు రైళ్లు, విమానాలు రద్దయినందున కనీసం ఒకటి, రెండు రోజులు భక్తులకు వసతులు సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తిరుమల యాత్రికులకు అండగా నిలవాలని సూచించారు. తిరుపతిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వివరించారు. కడప జిల్లాలో గండిపడిన చెరువుల్లో యుద్ధప్రాతిపదికన సురక్షిత చర్యలు చేపట్టాలని వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరదనీరు(AP FLOODS 2021) తగ్గగానే అధికారులు పంట నష్టాన్ని లెక్కించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వీలైనంత త్వరగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షలు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.