రాష్ట్రంలో చిక్కుకుపోయి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వారిని తరలించేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరీశిలించి నోడల్ అధికారిగా పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను, పోలీస్ విభాగం నోడల్ అధికారిగా అదనపు డీజీ జితేందర్ను నియమించారు.
వలస కూలీల తరలింపునకు నోడల్ అధికారుల నియామకం - special officers migrant labour shifting
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు వలస కూలీలను కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు నోడల్ అధికారిగా పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను, పోలీస్ విభాగం నోడల్ అధికారిగా అదనపు డీజీ జితేందర్ను నియమించింది.
నోడల్ అథారిటీకి అధికారుల బృందం సహాయ సహకారాలు అందిస్తుందని సీఎస్ చెప్పారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన వ్యక్తులను తరలించేందుకు ప్రోటోకాల్ రూపొందించామన్నారు. రాష్ట్రంలో నిలిచిపోయిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల వివరాలను తెలపాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖను రాసినట్టు సోమేష్ కుమార్ చెప్పారు. తెలంగాణలో నిలిచిపోయిన వారిని, వారి రాష్ట్రాలకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా కోరినట్లు వివరించారు.
అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ట్రాలకు సంబంధించిన నోడల్ అథారిటీలను తెలంగాణ నోడల్ అథారిటీలతో సంప్రదించాలని కోరారు. తెలంగాణలో నిలిచిపోయిన వారికి అవసరమైన స్క్రీనింగ్ నిర్వహించి, వైరస్ లక్షణాలు లేని వారికి ప్రయాణం కోసం పాసులను నోడల్ అథారిటీ జారీ చేస్తుందని సీఎస్ తెలిపారు. సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు రవాణా సౌకర్యం కోసం ఆయ రాష్ట్రాలను సంప్రదించాలని సూచించారు.