తెలంగాణ

telangana

ETV Bharat / city

27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి

ఛైర్మన్​, మేయర్ల ఎన్నికలో అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక కోసం ఇవాళ నోటీసు జారీ అవుతుందని తెలిపింది. పార్టీలు నిర్ధిష్ట గడువులోగా ఏ, బీ ఫారాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యత్వం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మున్సిపల్ కమిషనర్లకు లేఖ ఇవ్వాలని స్పష్టం చేసింది.

SPECIAL ELECTION CODE
27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి

By

Published : Jan 25, 2020, 5:10 AM IST

27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి

ఇవాళ పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. తొమ్మిది కార్పొరేషన్లకు మేయర్లు, 120 పురపాలక సంఘాల ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. అదే రోజు డిప్యూటీ మేయర్, వైస్​ఛైర్మన్​ను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపర్చేందుకు వీలుగా ఈ సాయంత్రం అధికారులు స్థానికంగా నోటీసు ఇస్తారు. 27న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎన్నిక నిర్వహిస్తారు. పరోక్ష ఎన్నిక నేపథ్యంలో 25వ తేదీ సాయంత్రం నుంచి ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.

ప్రభుత్వపరంగా ఎలాంటి హామీలు, ఒప్పందాలు చేసుకోరాదని ఈసీ స్పష్టం చేసింది. పరోక్ష ఎన్నికలో తమ అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలు ఏ, బీ ఫారాలు ఇవ్వాల్సి ఉంటుంది. 26వ తేదీ ఉదయం 11 గంటలలోగా ఏ ఫాం, 27 ఉదయం 10 గంటలలోగా బీ ఫాం సమర్పించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు తమ విప్​లను నియమించుకోవచ్చని పేర్కొంది. విప్ ఎవరన్నది 26 ఉదయం 11 గంటలలోగా తెలియజేయాలని సూచించింది. విప్​ జారీ వివరాలను 27 ఉదయం 11 గంటల 30 నిమిషాలలోగా సమర్పించాలంది. పరోక్ష ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.

మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలో ఎక్స్​ అఫీషియో సభ్యులకూ ఓటుహక్కు ఉండనుంది. ఇందుకోసం పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి సభ్యులు ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నేటి సాయంత్రం వరకు అవకాశం ఉందని పురపాలక శాఖ తెలిపింది. ఎక్స్​ అఫీషియో సభ్యత్వం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు లేఖలు సమర్పించాలి.

పాలకమండళ్ల ప్రత్యేక సమావేశం రోజున ఉదయం 11 గంటలకు ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవీచూడండి: పుర ఫలితాలు: భవితవ్యం తేలేది నేడే

ABOUT THE AUTHOR

...view details