ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రోజూవారిగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గాయన్న సింఘాల్.. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు తెలిపారు.
VACCINE DRIVE: 'కేంద్రానికి ఏపీ సామర్ధ్యం తెలిపేలా.. స్పెషల్ డ్రైవ్'
ఒక్కరోజులోనే 9 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేయటం ద్వారా... ఏపీలో వాక్సినేషన్ ప్రక్రియ సామర్ధ్యాన్ని కేంద్రానికి నివేదిక రూపంలో వివరించనున్నట్లు... ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని నెహ్రూనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఏపీలో సుమారు 96 లక్షల మందికి ఒక్క డోస్ వ్యాక్సిన్ ఇవ్వగలిగామన్న సింఘాల్.. కేంద్రం నుంచి కొత్తగా వచ్చిన 9 లక్షల డోసులను ఒక్కరోజులోనే పంపిణీ చేయడానికి స్పెషన్ డ్రైవ్ చేపట్టామని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 9 లక్షలకుపైగా వాక్సిన్లు వేసి.. ఏపీలో వాక్సినేషన్ సామర్ధ్యంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోగలిగేలా మందులు, ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతున్నట్టు వివరించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఎంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లు ఆర్డర్ పెట్టామన్న ఆయన.. కొవిడ్ నిబంధనలు పాటించకపోతేనే అసలైన ప్రమాదమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.