కొవిడ్ బాధితులకు పౌష్టికాహారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు సమయానుకూలంగా, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఆసుపత్రి పాలనాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా భోజనాల విషయంలో రోగులను ఆరా తీశారు. వారంతా బాగున్నాయంటూ సమాధానమివ్వడంతో.. సీఎం సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆహారం విషయంలో నిబంధనలతోపాటు నాణ్యతను పక్కాగా పాటించేలా పర్యవేక్షణకు ఆసుపత్రికి చెందిన పలువురు వైద్యులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ.. రోజూ ఉదయం అందించే టిఫిన్‌తోపాటు టీ, స్నాక్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఎలా ఉండాలో, ఏమేం అందించాలో వారం రోజుల జాబితాను రూపొందించి ఇస్తుంది. ఆ మేరకు డైట్ విభాగం తయారు చేస్తుంది.
- ఉదయం 7 గంటలకు ఇడ్లీ, వడ, చాయ్, పాలు, బ్రెడ్డు అందుబాటులో ఉంచుతారు. ఎవరికి ఇష్టమైంది వారు తీసుకుంటారు.
- ఉదయం 10 గంటల సమయంలో చాయ్, బిస్కెట్లు ఇస్తారు.
- మధ్యాహ్నం 12 గంటలకు అన్నం, ఫ్రైడ్‌రైస్, ఆకుకూర పప్పు, వెజ్ కర్రీ, చికెన్ కర్రీ, ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు, పాపడ, స్వీట్, అరటిపండు అందిస్తారు.
- సాయంత్రం 4 గంటలకు వంద గ్రాముల చొప్పున ఎండు ఫలాలు, చాయ్ ఇస్తారు.
- రాత్రి 8 గంటలకు అన్నం, ఫ్రైడ్‌రైస్, వెజ్ కర్రీ, చికెన్ కర్రీ, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు, అరటిపండు, బాదం పాలు ఉంటాయి.