Telangana Congress: పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, నియోజకవర్గాలవారీగా నాయకత్వ లోపాలపైనా కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో జరిగిన ముఖ్యనేతల సమావేశం కీలక పరిణామాలకు వేదికైంది. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యనేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్యనేతలందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్దేశించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న కీలక నాయకులతో ఏఐసీసీ ముఖ్యనేతలు ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో కార్యక్రమాల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు ఉంటే చర్చించుకోవాలని, అవసరమైతే ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌తో పాటు ఇతర ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శుల తోడ్పాటు తీసుకోవాలని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై కూడా సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కుదిర్చారు.
కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించిన సమన్వయ సమావేశం అనంతరం నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ తమిళిసైని ముఖ్యనేతలంతా కలిశారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడిలోనూ ముఖ్యనేతలంతా సమైక్యంగా వ్యవహరించారు. పార్టీ నేతలంతా కలసికట్టుగా ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం కింది స్థాయి వరకు చేరడం కూడా కీలకాంశంగానే భావిస్తున్నారు. ఇకపై రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక అంశాలను గుర్తించి వాటిపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తాల్సిన స్థానిక అంశాలను గుర్తించే బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అప్పగించనున్నారు. పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసేందుకు ప్రాంతాల వారీగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిసభను వరంగల్‌లో నిర్వహించనున్నారు. ఇది పలుమార్లు వాయిదా పడినందున ఈసారి సభను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తున్నారు. రంజాన్ ముగిసిన అనంతరం మే మొదటివారంలో రాహుల్ సభ నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు.