నదుల అనుసంధానాన్ని(Special Authority for Rivers Connection) వేగవంతం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపుదాల్చనుంది. ఇందుకు జాతీయ నదుల అనుసంధాన అథారిటీ(ఎన్.ఐ.ఆర్.ఎ)ని ఏర్పాటు చేయాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ((National Water Development Authority)) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. జాప్యం కాకుండా చూసేందుకు మొదట ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. గత నెల 22న ఛైర్మన్ వెదిరే శ్రీరాం అధ్యక్షతన నదుల అనుసంధానంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.
న్యాయశాఖ నివేదిక
నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్(ఎన్.ఐ.ఆర్.ఐ) ఏర్పాటుపై జరిగిన ఈ సమావేశం వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై న్యాయసలహా కోరగా, ఇందుకు సానుకూలంగా ఆగస్టు 9న న్యాయశాఖ నివేదిక పంపింది. అథారిటీ(Special Authority for Rivers Connection)ని చట్టబద్ధంగా పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయాలని, అందుకు సమయం పడుతుందని, న్యాయసలహా మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఉండదని ఎన్.డబ్ల్యు.డి.ఎ. డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ సమావేశం దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ఇది పనిచేయవచ్చని ఆయన పేర్కొన్నారు.